Cyclone Murusu: తుఫాన్ అనే పదం వింటేనే.. ఏపీ తీర ప్రాంతాలు వణికిపోతున్నాయ్. మొన్నటికి మొన్న వచ్చిన అర్నబ్ తుఫాన్.. కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసింది. ఈదురుగాలులకు వేల సంఖ్యలో చెట్లు, తోటలు ఒరిగిపోయాయ్. పంటలు మునిగాయ్. ఈ నష్టం నుంచి తేరుకోకముందే.. మరో తుఫాన్ తరుముకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. దీనికి.. మురసు అనే పేరు పెట్టారు. ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఇప్పటికే.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రేపటికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశముంది. మంగళవారం ఉదయం నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటుతుందని చెబుతున్నారు. ఆ సమయంలో.. గంటకు వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. ఇప్పటికే.. తుఫాన్ ఎఫెక్ట్‌తో నెల్లూరులో వర్షాలు మొదలయ్యాయ్. అయితే, మొన్న వచ్చిన అర్బన్ తుఫాన్ అంత ఎఫెక్ట్.. మురసుతో ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మచిలీపట్నం, నెల్లూరు మధ్య తీర ప్రాంతాల్లో ప్రభావం చూపొచ్చంటున్నారు.
ఇంకొన్ని గంటల్లో తీవ్ర తుపాను
ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం.. శనివారం వాయుగుండంగా బలపడింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. తుపానుగా మారింది. ఇంకొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. మురసు తుపాను ప్రభావంతో.. రానున్న మూడు రోజులు దక్షిణ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. క్రమంగా ఈదురుగాలులు మరింత బలంగా వీయనున్నాయి. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థ హెచ్చరించింది.
మురసు రూపంలో మరో విపత్తు..
ఇప్పటికే.. అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడిప్పుడే అంతా సెట్ అయిందనుకుంటున్న సమయంలో.. మురసు రూపంలో మరో విపత్తు ముంచుకొచ్చింది. తుఫాన్ తీరం దాటే వరకు.. ఏపీ అంతా హై అలర్ట్‌లో ఉండనుంది. మురసు తుఫాన్ ప్రభావం తెలంగాణపైనా ఉండనుంది. మంగళ, బుధ వారాల్లో వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
Also Read: మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చాలా? ఈ కొత్త రూల్ తెలిస్తే షాక్ అవుతారు!