El Niño: టీచింగ్ హాస్పిటల్స్, టీవీవీపీ దావాఖాన్లలో పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యారోగ్యశాఖ ముందస్తు ప్రిపరేషన్లు మొదలు పెట్టింది. ‘ఎల్ నినో’ ప్రభావంతో ఏర్పడే నీటి కొరత, విద్యుత్ సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ‘ఎల్ నినో యాక్షన్ ప్లాన్’ను సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పేషెంట్లకు వైద్య సేవల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆసుపత్రుల్లో తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరాలో ఎక్కడా అడ్డంకులు రాకుండా ఉండేందుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. హాస్పిటల్స్ లో నీటి సమస్యలు రాకుండా నిల్వ సామర్ధాన్యి పెంచనున్నారు.
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న నీటి సంపులు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిల్వ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న స్థాయి కంటే 50 శాతం మేర పెంచాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.నిత్యం వేలాది మంది రోగులు, వారి సహాయకులతో కిటకిటలాడే హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రధాన బోధనాసుపత్రులతో పాటు రాష్ట్రంలోని అన్ని టీచింగ్ హాస్పిటల్స్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ దవాఖాన్లలో నీటి సంపుల కెపాసిటీని వెంటనే పెంచనున్నారు.అంతేగాక నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ఆసుపత్రి ప్రాంగణాల్లో తక్షణమే కొత్త బోర్ల తవ్వకానికి అనుమతులు మంజూరు చేశారు. పాత బోర్లకు రిపేర్లు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పవర్ కట్ లు ఏర్పడితే హాస్పిటల్స్ లోని ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, ఎమర్జెన్సీ వార్డులలో తీవ్ర సమస్యలు వస్తాయి. ఒక్క నిమిషం పవర్ బ్రేక్ అయినా..పేషెంట్ల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి చిన్న, పెద్ద ఆసుపత్రిలో బ్యాకప్ వ్యవస్థను బలపరిచేందుకు కొత్తగా పవర్ ఫుల్ జనరేటర్లను అమర్చనున్నారు. అకస్మాత్తుగా విద్యుత్ నిలిచిపోతే జనరేటర్లు నిరంతరాయంగా నడవడానికి కావలసినంత డీజిల్‌ను ముందుగానే రిజర్వ్‌గా ఉంచుకోవాలని ఉన్నతాధికారులు హాస్పిటల్ టీమ్ ను ఆదేశించారు.మరోవైపు ఆసుపత్రుల్లో వైరింగ్, ట్రాన్స్ఫార్మర్ల పనితీరుపై ముందస్తుగా ‘ఎలక్ట్రికల్ ఆడిట్’ పూర్తి చేసి, అవసరమైన చోట విద్యుత్ రిపేర్ వర్క్స్‌ను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి అధికారులకు సూచించారు.
యాక్షన్ ప్లాన్‌లో భాగంగా కేవలం మౌలిక వసతులే కాకుండా సేవలు అందించే సిబ్బంది ని కూడా అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పేషెంట్లకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది 24 గంటలూ నిరంతరం అందుబాటులో ఉండేలా షిఫ్ట్ డ్యూటీలను ప్లాన్ చేశారు. ఎన్ నినో ప్రభావంతో పేషెంట్ల సర్జరీలకు చిక్కులు లేకుండా ముందస్తు ప్లాన్ లో భాగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వేసవిలో వడదెబ్బ బారిన పడిన వారికి తక్షణ చికిత్స అందించేందుకు వీలుగా ప్రతి దవాఖానలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, రీహైడ్రేషన్ ఫ్లూయిడ్స్, అత్యవసర మందులను కొరత లేకుండా సమకూర్చారు.
వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేకంగా కూలర్లు, ఏసీలు కలిగిన ఐసోలేషన్ వార్డులను అందుబాటులోకి తెస్తున్నారు.ఈ ఎల్ నినో యాక్షన్ ప్లాన్ అమలును పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. రోజువారీగా నీటి నిల్వ స్థాయిలు, జనరేటర్ల కండిషన్, మందుల లభ్యతపై నివేదికలు అందించాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు..ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు.
Aklso Read: ఇండియా దాటితే, కుక్క కూడా క్రికెటర్లను పట్టించుకోదు..లలిత్ మోడీ సంచలనం!