Pulivendula: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆరోపించారు మాజీ సీఎం జగన్. అందుకు పులివెందులలో జరుగుతున్న ఘటనలు నిదర్శనమన్నారు. పులివెందులలో రీపోలింగ్ కు డిమాండ్ చేశారు. అధికార పార్టీకి పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు.
ఎవరు నేర్పని విద్య వారికి ఒక్కోసారి రివర్స్ అవుతుంది. చెడు చేస్తే.. మళ్లీ ఆ చెడు తగులుతుంది. ప్రస్తుతం ఏపీలో జగన్ పరిస్థితి అలాగే ఉంది. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేయకుండా ఏకగ్రీవాలకు తెరలేపారు. ప్రజాస్వామ్యం, గ్రామ స్వపరిపాలన అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. తీరా ఆయన దగ్గరకు వచ్చేసరికి ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ కొత్త కొత్త మాటలు చెబుతున్నారు.
ఏపీ వ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. బెంగుళూరు నుంచి హెలికాప్టర్ లో పులివెందులకు వచ్చారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. ఓటు వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, అందుకే ఎన్నికల్లో అరాచకాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పోలీసులు దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి సహకరిస్తున్నారని రుసరుసలాడారు.
మా ఏజెంట్లను బూతుల్లోకి రానివ్వడం లేదన్న జగన్, పులివెందులలో 70 బూతుల్లో మా ఏజెంట్లు లేరని తేల్చేశారు. చైర్‌పర్సన్ అభ్యర్థిపై దాడి చేశారని, మీడియాపై దాడులకు పాల్పడుతున్నారని రుసరుసలాడారు. ఓటర్లను అడ్డుకొని స్లిప్‌లు చించేస్తున్నారని, నాకు ఓటున్న బూత్‌లో ఏజెంట్లను అనుమతించారని చెప్పారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో ఇప్పటికే చర్చించామన్నారు. హెలికాప్టర్ ల్యాండ్ కాకూడదని అనుమతి నిరాకరించారన్న జగన్, తప్పనిసరి పరిస్థితుల్లోనే ల్యాండ్ చేశారన్నారు.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది కాబట్టే.. దొంగ ఓట్లు వేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి చేస్తుంటే కాక్రోచ్‌లు, మావోయిస్టులు పుడుతారన్నారు. పోలింగ్ అక్రమాలపై సుప్రీంకోర్టుకు వెళ్లామన్నారు. ఫిర్యాదు చేసేందుకు ఆర్వీ దగ్గరకు వెళ్తున్నామన్నారు. ఈ ఎన్నికలు రద్దు చేసి ఎందుకు రీపోలింగ్ పెట్టకూడదని ప్రశ్నించారు. ఎస్ఈసీ ఎన్ని సీసీ కెమెరాలు పెట్టింది? కేవలం 10 పోలింగ్ బూతుల్లో వైసీపీ ఏజెంట్లు ఉన్నారని చెప్పుకొచ్చారు.
ALSO READ: పులివెందులలో హైటెన్షన్.. జగన్ కాన్వాయ్ ఆపిన దస్తగిరి, మా జీవితాలను నాశనం చేశారు, రంగంలోకి పోలీసులు
జగన్ చేసిన ఆరోపణలపై అధికార పార్టీ నేతలు ప్రశ్నించారు. రాష్ట్రమంతా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, పులివెందులలో ఈ సమస్య ఏంటని ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాల తరబడి ఏకగ్రీవాలకు తెరలేపారని, స్వేచ్ఛగా ఎన్నికలు జరపడం జగన్‌కు ఇష్టంలేదని అంటున్నారు. ఈ క్రమంలో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.