
Danger Snails : దేశంలోనే నిషేధిత నత్తలను ఆంధ్రప్రదేశ్ లోని ఉయ్యూరులో ఉన్న విశ్వశాంతి స్కూల్ లో ఓ వ్యక్తి పెంచడం కలకలం రేపుతోంది. థాయ్ లాండ్ కు చెందిన ఈ నత్తలు చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్క నత్త దాదాపు 50 సెంట్ల పొలం పంటను నాశనం చేస్తుందని హెచ్చరించారు. ఈ నత్తలను పెంచుతున్న ఆ వ్యక్తి విశ్వశాంతి విద్యాసంస్థల చైర్మన్ కుమారుడు మాదాల చంద్రశేఖరే కావడంతో తీవ్రదుమారం రేగింది. థాయ్ లాండ్ నుంచి యాపిల్ స్నెయిల్ నత్తలను తెప్పించి విద్యాసంస్థల ఆవరణలోనే వాటి పెంపకాన్ని నిర్వహిస్తున్నారు. ఇదంతా వీడియోతీసి యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ వీడియో చూసిన బయాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే విశ్వశాంతి విద్యాసంస్థల ఆవరణలో తనిఖీలు చేపట్టగా.. ప్రత్యేకంగా ట్యాంకులలో పెంచుతున్న నత్తలు లభ్యమయ్యాయి. నిషేధిత, ప్రమాదకరమైన నత్తలను స్కూల్ ఆవరణలో పెంచడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. వీటిలో ఏ ఒక్కటి బయటికొచ్చినా మొత్తం పంటంతా నాశనమైపోతుంది. బుధవారం నిర్వహించిన తనిఖీల్లో అంతా సీజ్ చేశామని పోలీసులు వెళ్లిపోయారు. కానీ.. గురువారం మరోసారి తనిఖీలు చేపట్టగా.. యాపిల్ స్నెయిల్ సీడ్స్ బయటపడ్డాయి. గదిలో ఉన్న సీడ్స్ ను చూసి అధికారులు అవాక్కయ్యారు. పెంపకందారుడైన చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. ఇతర దేశం నుంచి వీటిని తీసుకొచ్చేటపుడు సెక్యూరిటీ తనిఖీల నుంచి ఎలా తప్పించుకున్నారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పెంచుతున్న నత్తలను ఏ దేశానికి ఎగుమతి చేస్తారు ? వీటిని దేనికి ఉపయోగిస్తారు ? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
.
.