ఏపీ సర్కారుపై ప్రతిపక్ష వైసీపీ మరోసారి విమర్శల దాడికి దిగింది. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సీఎం చంద్రబాబు, కూటమి నేతలు చూస్తూ ఉన్నారని, ఈ విషయం ప్రజలకు అర్థంకాకుండా ఉండేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడుతోంది. డీలిమిటేషన్ అంశాన్ని ఇందుకు సాకుగా చూపుతోంది. సీఎం చంద్రబాబు ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఆయన తలుచుకుంటే రాష్ట్రంలోనే కాదు దక్షిణాదికి కూడా న్యాయం చేయగలరని ప్రతిపక్ష వైసీపీ బలంగా వాదిస్తున్నది.కానీ, పదవులు, అధికారం కోసం ఆయన సైతం కేంద్రం వద్ద సాగిల పడ్డారని వైఎస్‌ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద బాబు తాకట్టు పెట్టారని విమర్శలు చేస్తున్నారు.
ఉత్తరాది డామినేషన్..
పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు ఇప్పటికే వచ్చింది. మరో బిల్లు మహిళా రిజర్వేషన్‌కు ఆమోదం లభించగా.. గెజిట్ కూడా విడుదల కావడంతో అది కాస్త చట్టరూపం దాల్చింది. అయితే, పార్లమెంటులో చర్చ జరుగుతుండగా గెజిట్ ఎలా విడుదల చేస్తారని కాంగ్రెస్ పార్టీ అగ్రానాయకత్వం అసహనం వ్యక్తం చేసింది.దీనికి తోడు మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసింది. ఇక సాయంత్రం 7 గంటలకు డీలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్ జరగనుంది. కేంద్రానికి లోకసభలో 293కు పైగా సభ్యుల మద్దతు ఉంది. ఆ బిల్లు ఆమోదం పొందాలంటే 2/3 మెజార్టీ కావాలి. అనగా 350 మంది ఎంపీలు మద్దతు అవసరం. కేంద్రానికి అంతగా మద్దతు లేదు. ఒకవేళ ప్రతిపక్షానికి చెందిన ఎంపీలు ఓటింగ్ సమయంలో గైర్హాజరు అయితే మెజార్టీ ఓటింగ్ సంఖ్య కూడా తగ్గనుంది. ఆ సమయంలో స్వతంత్రులు, ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో బిల్లును కేంద్రం ఆమోదించుకుంటుందా? అనేది తేలాల్సి ఉంది. అదే జరిగితే పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఉత్తరాది డామినేషన్ పెరుగుతుందని వైసీపీ ఆరోపిస్తున్నది.
జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు ఉంటుందని అందరూ భావించారు.జనగణన ఇంకా కొనసాగుతోంది. అందులోనూ కులగణన కూడా అంతర్గతంగా ఉంటుందని కేంద్రం పేర్కొన్నది. జనగణన పూర్తవ్వడానికి మరో ఏడాదిన్నర పట్టచ్చు. సెన్సస్ తర్వాతే డీమిలిటేషన్ ఉంటుందని అంతా భావించారు. కానీ, కేంద్రం అనుహ్యంగా మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను పార్లమెంట్ ముందుకు తెచ్చింది. అయితే, దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన తెలుపుతుండటంతో జనాభా దామాషా ప్రకారం కాకుండా అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం సీట్లు పెంచుతామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు డ్రాప్టు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బిల్లు ఆమోదం పొందితే పార్లమెంటులో 850 వరకు సీట్లు పెరగనున్నాయి.
రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టు షాక్.. పౌరసత్వం వివాదంపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశం!
దక్షిణాది నుంచి మొత్తంగా 199 సీట్లు పెరగనున్నాయి. సౌత్‌లో (తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక) రాష్ట్రాలు ఉన్నాయి. ఇక ఉత్తర భారతం నుంచి ప్రస్తుతం ఉన్న సీట్లతో పాటు కొత్తవి కలుపుకుని 600లకు పైగా సీట్లు పెరగనున్నాయి. ఈ ప్రకారం కేంద్రంలో ఏదైనా పార్టీ అధికారంలోకి రావాలంటే అత్యధిక సీట్లు పెరిగే రాష్ట్రాలపైనే వారి ఫోకస్ ప్రధానంగా ఉండనుంది.మెజార్టీ స్థానాలు ఉత్తరాది నుంచే ఉండటంతో ఎన్నికల సమయంలోనూ, అధికారంలోకి వచ్చాక కూడా జాతీయ పార్టీలు ఉత్తరాది మీదే ప్రధానంగా ఫోకస్ పెడుతాయని, అప్పుడు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని, నిధుల కేటాయింపు, రాష్ట్రాల వాటా చెల్లింపుల్లోనూ ఇదే వివక్ష ఉంటుందని ఇక్కడి ప్రధాన పార్టీలు, ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఈవిషయంలో చొరవ తీసుకోకపోతే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎలాగైతే కేంద్రం మొండిచేయి చూపించిందో అలాగే జరుగుతుందని రాష్ట్రంలో ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్నది.