Deputy CM Pavan kalyan :
ఉపాధి హామీ పనులపై పవన్ కీలక ఆదేశాలు
ప్రతి దశలో నాణ్యత తనిఖీ చేయాలని సూచన
గత ప్రభుత్వం లాగా చేయొద్దని హెచ్చరిక జారీ
పలు విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహణ
అధికారులకు డిప్యూటీ సీఎం కీలక సూచనలు
అమరావతి, స్వేచ్ఛ:
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న పనుల నాణ్యతలో రాజీ పడవద్దని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాల్సిందేనని సూచించారు. పనులు ఏ దశలో ఉన్నాయో కూడా ప్రజలకు తెలియజేస్తేనే మరింత పారదర్శకత ఉంటుందన్నారు. ఆదివారం సచివాలయంలో గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ, పలు విభాగాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా అధికారులకు పవన్ పలు కీలక సూచనలు, సలహాలు చేశారు. పనులు సాఫీగా సాగేందుకు కేంద్రం నుంచి ఉపాధి హామీ, 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. రాష్ట్రంలో 13,326 పంచాయతీల్లో అభివృద్ధి పనుల నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు.
ALSO READ : ఏలూరులో 200 మందికి కుచ్చుటోపీ పెట్టిన అమెరికా యాప్
ఇలా చేయండి..
2024-25 లో 3వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్లు బీటీ రోడ్లు, ఫారం పాండ్లు 25వేలు, గోకులాలు 22,525, నీటి సంరక్షణ కందకాలు 30వేల ఎకరాలకు సంబంధించి పనులు ప్రారంభం అయ్యాయని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని పనులు పల్లె పండుగ నుంచే షురూ అయినట్లు చెప్పారు. ఈ పనులు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు సాధించాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యంగా పూర్తి చేసి, అందరికీ ఆదర్శంగా నిలవాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. ముఖ్యంగా ఏపీలోని అన్ని గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు వెళ్లే రోడ్లను బాగుచేయడం ప్రధాన లక్ష్యమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం లాగా పంచాయతీలకు దక్కాల్సిన నిధులను పక్కదారి పట్టించొద్దని అధికారులను పవన్ హెచ్చరించారు. సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డుల ద్వారా కూడా ఏ పంచాయతీకి ఎంత నిధులు అందాయి? వాటి ద్వారా చేస్తున్న పనులు ఏమిటి? అనేది కూడా ప్రజలకు వివరించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
Prefix: