Tirumala: కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. ఇక్కడి అనువణువు మహిమాన్వితం. అందుకే నిత్యం భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. అయితే ఇంతటి ప్రసిద్ధ క్షేత్రంలో భక్తులు పలు పద్దతులు తప్పక ఆచరించాలి. అలాగే కొన్ని తప్పులకు దూరంగా ఉండాలి. అప్పుడే శ్రీవారి కరుణాకటాక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇంతకు తిరుమలలో క్షేత్రంలో చేయకూడని పనులు ఏమిటి? చేయదగ్గ పనులు ఏమిటి? తెలుసుకుందాం.
టీటీడీ ప్రత్యేక పర్యవేక్షణ..
తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటుంది. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండ, టీటీడీ నిఘా బృందం అనువణువు నిఘా ఉంచుతుంది. ఎవరైనా భక్తుల హక్కులకు భంగం కలిగిస్తే వారిపై టీటీడీ చర్యలు తీసుకుంటుంది. అంతేకాదు నిబంధనలు ఉల్లంఘించిన భక్తులపై సైతం టీటీడీ సీరియస్ యాక్షన్ లోకి దిగుతుంది. అందుకే తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడు తప్పనిసరిగా, ఇక్కడి నిబంధనలు పాటించాల్సిందే.
తిరుమలలో చేయకూడని తప్పులు..
పవిత్రమైన తిరుమల క్షేత్రానికి వచ్చే సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మద్యం, మాంసాహారం తీసుకురాకూడదు. తిరుమలలో మాంసాహారానికి, మద్యానికి ప్రవేశమే లేదు. ఇది పవిత్ర క్షేత్రం కావడం వల్ల అలాంటి పదార్థాలు తీసుకురావడం నిషేధం. షార్ట్‌లు, బర్మూడాలు, అసభ్య దుస్తులు ధరించడం ఇక్కడ నిషేధమే. భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలి. పురుషులు పంచె, ధోతి, మహిళలు చీర, చుడీ దార్ ధరించాలి. ధర్మానికి విరుద్ధమైన దుస్తులు ధరించరాదు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే టికెట్స్ , శ్రీవారి సమాచారాన్ని పొందాలి. మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
అనవసర శబ్దాలు చేయరాదు
తిరుమల ఆలయ ప్రాంగణంలో సెల్ఫీలు, వీడియోలు తీస్తే అది భక్తి శ్రద్ధకు విరుద్ధంగా భావిస్తారు. దీనిపై ఆలయ సెక్యూరిటీ చాలా కఠినంగా ఉంటుంది. ఇలా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొందరు కటకటాల పాలయ్యారు. అలాగే ఆలయంలో శబ్దం చేయడం నిషిద్ధం. భక్తుల ప్రశాంతతకు భంగం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులు ఈ నియమాన్ని పాటించాలి. అనుమతి లేని వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడ నిషేధం.
క్యూ లైన్ లలోకి జంప్..
తిరుమలలో వాహనాలపై నిబంధనలు ఉన్నాయి. వాటిని అతిక్రమిస్తే జరిమానా విధించబడుతుంది. క్యూ సిస్టం పాటించకపోతే ఆలయ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుంటారు. తిరుమల పవిత్ర స్థలం. ఇక్కడ పారిశుద్ధ్యం కాపాడడం భక్తుల బాధ్యతగా గుర్తుంచుకోవాలి. అనవసరంగా ఫొటోలు తీస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించడం, ఇతర భక్తులకు భక్తి భంగం కలిగేలా వ్యవహరించరాదు. మద్యం సేవించి ఆలయ పరిసరాల్లోకి రావడం నేరం. విచారణ తరువాత పోలీసుల చర్యలు తప్పవు. కోపంగా ప్రవర్తించడం, గొడవలు చేయడం వంటివి చేయకూడదు.
పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు..
తిరుమలకు వచ్చే భక్తులు నిత్యం గోవింద నామస్మరణ సాగిస్తే, ఇతర భక్తులకు భక్తిభావాన్ని చాటి చెప్పవచ్చు. తలనీలాలు సమర్పించిన తరువాత స్నానం చేసి దర్శించుకోవాలి. నిశ్శబ్దంగా ఆలయంలో ఉండాలి. ఇతర భక్తుల భావాలను గౌరవించాలి. శ్రీవారి సేవకులతో, టీటీడీ ఉద్యోగులతో మర్యాదగా ప్రవర్తించాలి. ఈ సూచనలను పాటించడం వల్ల శ్రీవారి కృప లభిస్తుంది, అలాగే పుణ్య ఫలితాన్ని సంపాదించుకోవచ్చు.
అన్నీ అనుమతులు ఉన్న గైడ్ లను నియమించుకోవాలి. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దానాలు, హుండీ విరాళాలు అధికారికంగా ఇవ్వాలి. ఆలయ దర్శన మార్గాలను గౌరవంగా అనుసరించాలి. అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలి. క్యూలైన్లు క్రమంగా అనుసరించాలి. TTD ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలి. గైడ్‌లు, సెక్యూరిటీ, వాలంటీర్ల సూచనలు పాటించాలి. అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్ల మార్గంలో పాదరక్షలు ధరించకుండా నడక సాగించడం మంచిది.
Also Read: Capital Amaravati: అమరావతికి దిష్టి తీయాలట.. మరీ ఇన్ని రికార్డ్స్ ఎలా?
ఎంతో పవిత్రమైన తిరుమలకు వెళ్లిన సమయంలో మన మనస్సు భక్తిభావంతో ఉండాలి. అక్కడి అనువణువు పవిత్రమైనది కాబట్టి నిరంతరం గోవింద నామస్మరణ సాగిస్తూ భక్తిని పెంపొందించాలి. అప్పుడే శ్రీవారి కరుణ కటాక్షం భక్తులకు కలుగుతుందని పండితులు తెలుపుతారు. మరి మీరు సమ్మర్ హాలిడేస్ కాబట్టి తిరుమలకు వెళుతున్నారా.. అయితే టీటీడీ నిబంధనలు తెలుసుకోవడం ఉత్తమం.