Alert for Tirumala Devotees : తిరుమలలో ఉన్న భక్తులకు గుడ్ న్యూస్. నేడు కుమారధార తీర్థ ముక్కోటి కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. భద్రతా ఏర్పాట్లపై టీటీడీ నిఘా, భద్రతా విభాగం, పోలీస్ అధికారులు తిరుమలలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమీక్ష నిర్వహించారు. శనివారం ఉదయం 5.30 గంటల నుంచి.. మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే కుమారధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు.
కానీ.. అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్య దృష్ట్యా.. అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లేందుకు అనుమతిని నిరాకరించారు. ఇక అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాపవినాశనం డ్యామ్ వద్ద ఉదయం 6 గంటల నుంచీ భక్తులకు పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు అవసరమైన షెడ్లు, మార్గమధ్యంలో నిచ్చెనలు, తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు వీలుగా అంబులెన్సులు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
Read More : నేడే టీడీపీ-జనసేన తొలి జాబితా ప్రకటన..
టిటిడి ఉద్యోగులందరికీ మంచి చేయాలన్నదే తన తపన అని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టిటిడి రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో భూమన కరుణాకరరెడ్డి కృతజ్ఞతా సభ, ఆత్మీయ సన్మాన కార్యక్రమం తిరుపతిలోని పరిపాలన భవనంలో ఉన్న పరేడ్ మైదానంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవారికి సహాయం చేయాలని చిన్నతనంలో తెలుగు మాస్టార్ చెప్పిన మాటలు తన మనసులో ఉండిపోయాయని, అప్పటి నుంచి అదే ఆలోచనగా జీవిస్తున్నానన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ తనకు తొలిసారి టిటిడి చైర్మన్ పదవిని ఇచ్చాక.. పేదవారికి సహాయం చేయాలన్న తన ఆలోచనలను ఆచరణలో పెట్టే అవకాశం లభించిందన్నారు.