Perni Nani: ‘అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో ఏపీ పోలీసులకు చూపిస్తా’ అని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో సీఐతో పేర్ని నాని వాగ్వివాదానికి దిగారు. ఇటీవల మచిలీపట్నం మెడికల్ కాలేజీ వద్ద పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేయాయి. పోలీసుల అనుమతి లేకుండా నిరసనలో పాల్గొన్నారని పేర్ని నానితో సహా 400 మందికి 41A నోటీసులు ఇచ్చారు.
పోలీసుల ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వొద్దని వైసీపీ వాట్సాప్ గ్రూపులో మచిలీపట్నం నగర వైసీపీ అధ్యక్షుడు మేకల సుబ్బన్న మెసేజ్ పెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా సుబ్బన్నను పోలీసులు స్టేషన్‌కు పిలిపించించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్నినాని, తన మద్దతుదారులు, వైసీపీ కార్యకర్తలతో ఆర్ పేట పోలీస్ స్టేషన్‌కు చేరుకుని హంగామా చేశారు.
పోలీస్ స్టేషన్‌లో సీఐ తో గొడవకు దిగిన @perni_nani గారు
మెడికల్ కాలేజ్ ధర్నా కేసు లో రోజు స్టేషన్ కి పిలుస్తున్నారని వేధిస్తున్నారని ఆరోపణ.
నేను అధికారం లోకి రాగానే నేను అంటే ఏంటో Andhra Pradesh Police కి చూపిస్తా : పేర్ని నాని pic.twitter.com/r09OIRSnxG
— Krishnaveni Paleti (@KrishnaveniYCP) October 10, 2025
సీఐతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. సీఐపై దురుసుగా ప్రవర్తించారు. అధికారంలోకి వచ్చాక మేమేంటో చూపిస్తామన్నారు. పోలీస్ స్టేషన్‌లో పేర్ని నాని చర్యలతో విసిగిపోయిన పోలీసులు స్టేషన్ నుండి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read: Delhi Crime News: జోద్‌పూర్‌లో ప్రేమ.. ఢిల్లీలో ముగింపు, వెనుక జరిగింది అదే?
సెప్టెంబర్ 19న మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీ భూముల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ‘చలో మెడికల్ కాలేజీ’ నిరసన కార్యక్రమం చేపట్టారు. పోలీసులు నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. మాజీ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌తో పాటు పలువురు వైసీపీ నేతలు మెడికల్ కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో మచిలీపట్నం పోలీసులు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని ఆర్.పేట సీఐ విధులకు ఆటంకం కలిగించారన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్ కాలేజీ దగ్గర నిరసన కేసులో.. కొందరికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నామని ఎస్పీ తెలిపారు. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో పేర్నినాని గ్రూపుగా పీఎస్‌కు వచ్చి వాగ్వాదానికి దిగారన్నారు.