2024 ఎన్నికల్లో విజయం తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై పెట్టారు. అంతే శ్రద్ధగా ఆ నోటిఫికేషన్ ని విడుదల చేసి ఏడాదిన్నరలోపే నియామకాలు కూడా పూర్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గత పాలనలో 13 డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఆయన హయాంలో ఇది 14వది. అంటే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా జరగకుండా ఆ తర్వాత కూటమి హయాంలో ఏడాదిలోపే డీఎస్సీ జరగడం మాత్రం గొప్ప విశేషం. ఐదేళ్లలో జగన్ డీఎస్సీ ద్వారా ఒక్క పోస్ట్ కూడా పూర్తి చేయలేకపోతే కూటమి అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరలోనే 15,941 మందికి ఉపాధ్యాయులుగా అవకాశాలివ్వడం విశేషం.
జగన్ ఓటమి..
2014-19 మధ్య కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ సమయంలో యువత కూడా పెద్ద ఎత్తున ఆయన వెంట నడిచింది. అదే ఊపులో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఆ విజయంలో యువత ముఖ్యపాత్ర పోషించింది. కానీ ముఖ్యమంత్రి అయ్యాక జగన్ వారిని పట్టించుకున్న పాపాన పోలేదనే వాదన ఉంది. సచివాలయాలు ఏర్పాటు చేసి పోస్ట్ లు భర్తీ చేసినా, అవి తమ సామర్థ్యానికి తగ్గవి కావనే అభిప్రాయం ఉద్యోగుల్లో కూడా ఉంది. ఇక నెలకి రూ.5వేలు ఇచ్చే వాలంటీర్ పోస్ట్ ల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. డీఎస్సీ, గ్రూప్స్ నోటిఫికేషన్లు లేకపోవడంతో చాలామంది సచివాలయం పోస్ట్ ల వైపు మొగ్గు చూపారు. రెండేళ్లపాటు రూ.15వేలు ఫిక్స్ డ్ శాలరీకి పనిచేశారు. ఆ తర్వాత కూడా ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో జగన్ పై యువత ఉద్దేశం మారిపోయింది. ఐదేళ్లలో కనీసం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇచ్చి పోస్ట్ లు భర్తీ చేయలేకపోవడం, సరిగ్గా ఎన్నికల ఏడాదిలో తూతూ మంత్రంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినా సకాలంలో పరీక్ష నిర్వహించలేకపోవడం జగన్ వైఫల్యంగా చెప్పుకోవచ్చు. ఫలితం 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనపడింది.
లోకేష్ గెలుపు..
2024లో కూటమి అధికారంలోకి వచ్చాక డీఎస్సీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పట్టుబట్టి నోటిఫికేషన్ విడుదల చేయించడం, సకాలంలో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల చేయించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఫలితంగా నేడు 15,941 మంది నియామక పత్రాలు అందుకోబోతున్నారు. అంతే కాదు, ఇకపై ప్రతి ఏడాదీ టెట్ నిర్వహిస్తామని కూడా హామీ ఇచ్చారు లోకేష్. 2029 ఎన్నికల లోపు కనీసం 2 సార్లు డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం కనపడుతోంది. డీఎస్సీని పగడ్బందీగా పూర్తి చేయడం ఇక్కడ మంత్రి లోకేష్ విజయమనే చెప్పుకోవాలి.
కోర్టు కేసులు..
తాజా డీఎస్సీ నోటిఫికేషన్ పై వైసీపీ సానుభూతిపరులు 106 కేసులో వేశారని, ఉద్యోగాల భర్తీని ఆపాలని చూశారని కూటమి వాదిస్తోంది. ఈ వాదనల్లో నిజం ఉన్నా లేకపోయినా డీఎస్సీ నియామకాలు కూటమి తొలి విజయంగానే చూడాలి. ఈ విషయంలో లోకేష్ ఏపీ యువతకు మరింత దగ్గరయ్యారు. మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు మెండుగా లభించే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం ఈ దఫా యువతపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.