Jagan On Ponnavolu: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు ఒకొక్కరుగా దూరం అవుతున్నారా? ఇప్పటికే చాలామంది నేతలు ఆ బాటపట్టేశారా? రేపో మాపో కొందరు రెడీ అవుతున్నారా? ఈ జాబితాలోకి మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు చేరిపోయారా? ఎందుకు ఆయనపై మరో వర్గం సీరియస్‌గా ఉంది? మేటర్ లేదని అర్థమైందా? అసలు మేటరేంటి?
మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి గురించి చెప్పనక్కర్లేదు. ఆస్తుల కేసులో జగన్‌కు సహాయం చేసినందుకు ఆయనకు వైసీపీ ప్రభుత్వం ఏఏజీ పదవి ఇచ్చారు. వైసీపీ హయాంలో ఆయన విపరీతంగా చెలరేగిపోయారు. తనకు తిరుగులేదని అనుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎన్ఆర్ఐ విభాగాలతో ఆయన టచ్‌లో ఉంటూ చేయాల్సిన పనులు చేశారు. అది వేరే విషయం.
ప్రస్తుతం వైసీపీ లీగల్ సెల్ విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్న పొన్నవోలును కొన్నినెలల కింద జగన్ ప్రమోషన్ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన్ని నియమించారు. దీంతో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఈ క్రమంలో వైసీపీ లీగల్ సెల్ రెండు భాగాలుగా చీలిపోయింది. ఒకరు పొన్నవోలు వర్గమైతే.. మరొకటి ఆయనకు వ్యతిరేక వర్గం తయారైంది.
మంగళవారం తాడేపల్లి వేదికగా వైసీపీ లీగల్ సెల్ సమావేశం జరిగింది. దీనికి పార్టీ అధినేత జగన్ హాజరయ్యారు. ఈ భేటీకి పొన్నవోలు వర్గం, ఆయన వ్యతిరేక వర్గాలు హాజరయ్యాయి. జగన్ సమక్షంలో ఇరువర్గాలు తోపులాటకు దిగారు. నీవు ఎవరంటే.. నువ్వెంత అనే స్థాయికి చేరింది. ఈ క్రమంలో పొన్నవోలుపై విరుచుకుపడ్డిందట వ్యతిరేక వర్గం.
ALSO READ: చేనేత రంగానికి ఏపీ బూస్ట్.. జీఎస్టీ భారం ప్రభుత్వానిదే
వైసీపీ కేసులను వాదించేందుకు పొన్నవోలు నియమించొద్దని వ్యతిరేక వర్గం జగన్‌కు విన్నవించారు. వెంటనే జోక్యం చేసుకున్న పొన్నవోలు, చెప్పడానికి మీరెవరు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటలు ముదిరాయి. మీరు వాదించిన కేసుల్లో ఎవరికి బెయిల్ వచ్చిందో చెప్పాలంటూ మరో వర్గం పొన్నవోలును ప్రశ్నించింది. దీంతో ఆయన సైలెంట అయిపోయారు.
ఈలోగా జోక్యం చేసుకున్న పొన్నవోలు, తన సేవలు వద్దనుకుంటే స్వచ్ఛందంగా తప్పుకుంటానని కాసింత ఆవేశంగా మాట్లాడారట. మీకొక దండం అంటూ సమావేశం నుంచి బయటకొచ్చాటర. లీగల్ సెల్ పదవి నుంచి ఆయన్ని తప్పించాలని ప్రత్యర్థి వర్గం డిమాండ్ చేసిందట. అడ్వకేట్ల మధ్య ఆ సన్నివేశాన్ని చూసిన జగన్.. ఆలోచనలో పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడిప్పుడే పార్టీ గాడిలో వెళ్తుందన్న సమయంలో పొన్నవోలుపై ఆ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడాన్ని అధినేత ఊహించుకోలేక పోయారని అంటున్నారు పార్టీ నేతలు. ఇలాంటి పరిస్థితుల్లో పొన్నవోలు కొన్నాళ్లు దూరం పెడితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారట. లీగల్ సెల్ పదవి నుంచి దూరంగా పెట్టి, పార్టీ కార్యదర్శిగా కంటిన్యూ చేస్తే బాగుంటుందని అంటున్నారట. రానున్న రోజుల్లో ఈ వ్యవహారంపై ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.