⦿ 2 ఎకరాలు ల్యాండ్ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం
⦿ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్‌కు కేటాయింపులు
⦿ స్థలం ఇవ్వొద్దని ఆందోళనకు దిగిన స్థానికులు
⦿ జూనియర్ కాలేజీ నిర్మించాలని నిరసన
విశాఖపట్నం, స్వేచ్ఛ: PV Sindhu: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు వైసీపీ హయాంలో కేటాయించిన రెండు ఎకరాల భూమిపై వివాదం నడుస్తోంది. ఆ స్థలం ఆమెకు ఇవ్వొద్దని, అక్కడ జూనియర్ కాలేజీ నిర్మించాలని స్థానికులు నిరసన దిగారు. గతంలోనే ఈ స్థలంపై వివాదం నెలకొన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక మరోసారి స్థానికులు ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లో కాలేజీ నిర్మించాల్సిందేనని ప్రజలు పట్టుబట్టారు. ఇంతవరకూ ప్రభుత్వం గానీ, అధికారులుగానీ ఈ వ్యవహారంపై స్పందించలేదు.
నాడు.. నేడు
వైసీపీ అధికారంలో ఉండగా సింధుకు 2021లో విశాఖపట్నం రూరల్‌లోని చినగదిలి మండలంలో 73/11,83/5, 6 సర్వే నెంబర్లలో పశుసంవర్థక శాఖకు చెందిన రెండు ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఈ స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు ఏర్పాటు చేయాల్సి ఆమె భావించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు కూడా వచ్చాయి. అత్యున్నత స్థాయి మౌలిక వసతులతో అకాడమీ ఏర్పాటు చేయాలని భావించారు. తొలి దశలో అకాడమీ, ఆ తర్వాత స్పోర్ట్స్ స్కూల్ నిర్మించాలని ప్లాన్ చేశారు. రిటైర్మెంట్ అయ్యాక అకాడమీలో శిక్షణ బాధ్యతలు చేపడుతామని ప్రభుత్వానికి సింధు హామీ కూడా ఇచ్చారు. ప్రతిభ కలిగిన పేదల పిల్లలను క్రీడల్లో ప్రోత్సాహించాలని నాడు పీవీ సింధును జగన్ కోరారు. అయితే నేడు ఆ స్థలం నేడు వివాదానికి దారితీసింది. ఈ రెండు ఎకరాల స్థలం సింధుకు వద్దు.. కాలేజీ నిర్మించాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.