Donations To Flood Victims In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు ఈ వర్షాలకు తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటికే 10మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు గుప్పెడు మెతుకుల కోసం ఎదురుచూస్తున్నారు.
భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బాధితులకు అవసరమైన నిత్యావసరాలు, సరుకులు అందిస్తున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నడూ లేనంతగా సినీ పరిశ్రమ నుంచి తమ స్థాయికి తగినవిధంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి పలువురు ఏపీ సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు.
అయితే, ఇప్పటివరకు విరాళాలు ప్రకటించిన వారిలో ఎక్కువగా పవన్ కల్యాణ్ సన్నిహితులు ఉండడం గమనార్హం. ఏపీలో కూటమి అధికారం వచ్చేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమించారు. ఆయన సేవలకు గుర్తింపుగా డిప్యూటీ సీఎం పదవి అప్పగించారు. పదవి బాధ్యతలు చేపట్టినప్పటినుంచి అద్భుతంగా పాలన అందిస్తున్నారు. దీంతో అతనిపై అభిమానం పెరిగిపోయింది.
కాగా, ప్రస్తుతం వరదల ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ఏపీకి మేము తోడు ఉన్నామంటూ..సినీ పరిశ్రమ స్పందిస్తుంది. వర్షాలు, వరదలు నన్ను కలచివేశాయని టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల చొప్పున రూ.కోటి విరాళం ప్రకటించారు. వరద విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు ఏపీ సీఎం సహాయనిధికి రూ.50 లక్షలు ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
దీంతో పాటు వైజయంతీ మూవీస్, బన్నీవాసు, త్రివిక్రమ్ రాధా కృష్ణతో పాటు సిద్దు జొన్నలగడ్డ ఇలా అందరూ ఏదో విధంగా పవన్ కల్యాణ్ తో సంబంధం ఉన్న సెలబ్రిటీలు కావడం, వీరంతా భారీగా విరాళాలు ప్రకటించంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకుడు అంటే మీలా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అంతకుముందు, వైసీపీ హయాంలో సినీ పరిశ్రమను వేధింపులకు గురిచేశారు. ప్రధానంగా సినిమాలను అడ్డుకోవడం, టికెట్ల ధరలు తగ్గించడంతో సినీ పరిశ్రమ నిర్మాతలు నష్టపోయారు. అగ్ర సినీ తారలు వెళ్లి అప్పటి సీఎంను కలిసిన సమస్యకు పరిష్కారం చూపించకుండా అవమానించినట్లు పలు వార్త కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. కానీ, ఆపదలో అదే పరిశ్రమ నుంచి విరాళాలు భారీగా వస్తున్నాయి. దీంతో అభిమానులు గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఏపీకి విరాళాలు ప్రకటించిన వారిలో ఎన్టీఆర్ రూ. 50 లక్షలు, విశ్వక్ సేన్ రూ.5లక్షలు, వైజయంతీ మూవీస్ రూ.25 లక్షలు ప్రకటించింది. అలాగే ఆయ్ మూవీకి వచ్చే వారంతపు వసూళ్లలో నిర్మాత షేర్ లోని 25 శాతాన్ని జనసేన పార్టీ తరఫున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. ఆయ్ మూవీ మేకర్స్ పవన్ కల్యాణ్ పై అభిమానంతో పాటు వరద బాధితులకు అండగా నిలవడానికి విరాళాలు ప్రకటించింది.
దీంతో పాటు టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు చినబాబు, నాగవంశీ సంయుక్తంగా రూ.50 లక్షలు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. అలాగే సిద్దు జొన్నలగడ్డ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.15 లక్షలు ప్రకటించారు. వీరంతా పవన్ కల్యాణ్ మిత్రులు కావడంతో ఆపద సమయంలో ఆదుకునేందుకు త్వరగా ముందుకొచ్చారని సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తోంది.
Also Read: అయ్యా.. ఆదుకోండి, చిన్న పిల్లలతో చిక్కుకున్నాం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
కాగా, భారీ వర్షాల ప్రభావంతో విజయవాడ ఇప్పటికీ వరదల్లోనే చిక్కుకుంది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ విపత్తు నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమ నుంచి పలువురు సెలబ్రిటీలు దేవుడిని ప్రార్థిస్తూ తమ వంతు సాయంగా చేయూత అందిస్తున్నామని తెలిపారు.