Droupadi Murmu : వైద్య విద్యను ఎంచుకోవడం ద్వారా మానవత్వంతో సేవ చేసేందుకు ముందుకు వచ్చారని.. అలాంటి యువతీ యువకులంతా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలందించేందుకు ముందుకు రావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. దేశ ఆరోగ్యాభివృద్ధిలో యువ వైద్యులు కీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ – ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి యువ వైద్యులకు అభినందలు తెలిపారు. మొదటి బ్యాచ్ విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేశారు.
కేంద్ర వైద్య విద్యాలయం తొలి బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు.. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం ఎయిమ్స్ కు చేరుకున్న రాష్ట్రపతి.. మంగళగిరిలోని ఎయిమ్స్ నుంచి వైద్య విద్య పూర్తి చేసుకున్న 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికేట్లు ప్రధానం చేశారు.
విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేసిన తర్వాత ప్రసంగించిన రాష్ట్రపతి.. యువ వైద్యులు తొలి ప్రాధాన్యంగా వైద్యానికి కాస్త దూరంగా ఉండే గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపించాలని కోరారు. ప్రజల ప్రాణాలను కాపాడడం, వారి ఆరోగ్యాలను మెరుగుపరిచే అద్భుత అవకాశం ఉన్న వైద్యులు.. వారి సేవల్ని జాతీయ ధృక్పథంతో నిర్వహించాలని పిలుపునిచ్చారు. జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. వైద్య విద్యలో అర్హత సాధించి బయటకు వెళ్లే వైద్యులు చిత్తశుద్ధితో పనిచేసి దేశ ఆరోగ్యాభివృద్ధి మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.
ప్రస్తుతం పట్టాలు అందుకున్న వైద్యుల్లో 2/3 వంతు మహిళా డాక్టర్లు ఉండడం సంతోషమన్న రాష్ట్రపతి.. దేశీయ మహిళలు, యువతులు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యులుగా వారి దగ్గరకు వచ్చే ప్రతి రోగికి అత్యుత్తమంగా వైద్య సేవలు అందించాలని, ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవల్ని అందించే సంకల్పంలో పాలుపంచుకోవాలని కోరారు.
వైద్య విద్యార్థులకు డిగ్రీలు ప్రధానం చేసే కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధికి సహకరిస్తామని ప్రకటించారు. ఎయిమ్స్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు. తొలి బ్యాచ్ పూర్తయిన సందర్భంగా హర్షం వ్యక్తంచేసిన సీఎం చంద్రబాబు..అత్యాధునిక సేలందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్ రానున్న రోజుల్లో మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం అభివృద్ధికి అనేక ప్రణాళికలు అమలు చేయనున్నట్లు ప్రకటించిన సీఎం.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమికి అదనంగా మరో 10 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో శీతాకాల విడిది
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శీతాకాల విడిది కోసం హైదారాబాద్ చేరుకున్నారు. ఏటా.. శీతాకాలంలో హైదరాబాద్ లో కొన్ని రోజులు ఉండే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మంగళగిరిలో కార్యక్రమం అయిపోగానే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేటలోని సైనిక విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ జిష్టు దేవ్ శర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు సీతక్క ఇతరులు స్వాగతం పలికారు. అనంతరం.. రాష్ట్రపతి బొల్లారం లోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. ఈ నెల 21 వరకు రాష్ట్రపతి ఇక్కడ విడిది చేయనుండడంతో రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.