Tirupati Drug Racket: కాలర్ ఎగరేస్తూ నడి రోడ్డుపై గంజాయి తాగుతుంటారు. మెడికల్ షాపుల్లో మత్తు బిల్లలు కొని మింగుతుంటారు. స్టేషనరీ షాపుల్లోని సొల్యూషన్స్ తీసుకుని పీల్చుతుంటారు. ఊరు అవతల ఫ్రెండ్స్‌తో మద్యం తాగుతుంటారు. ఇవన్నీ చేస్తుంది ఎవరో కాదు.. పట్టుమని 15 ఏళ్లు నిండని పిల్లలే. పైగా ఇవన్నీ పట్టపగలే జరుగుతున్నాయి కూడా. ఎంత నిఘా పెట్టినా యువత అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. చేయిదాటిపోతున్నారు అనడానికి తిరుపతి ఘటన మరో ఉదాహరణ.
తిరుపతిలో మత్తులో జోగుతున్న మైనర్లు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుడి పాదాల చెంత.. మత్తు పదార్థాల వినియోగం కలకలం రేపింది. మైనర్లు ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. ఇందిరా ప్రియదర్శిని మార్కెట్‌లో కొందరు యువకులు మత్తు ఇంజెక్షన్స్ తీసుకుంటుండగా.. స్థానికులు వీడియో తీశారు. దీంతో మరోసారి డ్రగ్స్ వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఎన్నిరకాల చర్యలు తీసుకున్నా డ్రగ్స్ వినియోగం పెరుగుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మత్తులో హల్‌చల్ చేస్తున్న యువకులు
మార్కెట్‌లో మత్తులో ఉన్న యువకులు హల్‌చల్ చేస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. తిరుపతిలో మత్తు పదార్థాలు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని.. అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు ఊరుకుంటున్నారని ఆరోపించారు. గంజాయి, మత్తు ఇంజెక్షన్ల బారిన పడి యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని.. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బిగ్‌టీవీ వరుస కథనాలు ప్రసారం చేసినా మొద్దు నిద్ర వీడని అధికారులు
తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్ షాపుల్లో మత్తు ఇంజెక్షన్లు అమ్ముతున్నారని బిగ్ టీవీ ఎప్పటి నుంచో చెబుతోంది. ఈ దందాపై వరుస కథనాలు కూడా ప్రసారం చేసింది. విచ్చలవిడి అమ్మకాలను అధికారులు అడ్డుకోకపోతే.. యువత అంతా మత్తు పదార్థాల బారిన పడతారంటూ హెచ్చరిస్తూనే ఉంది. అయినా అధికారులు మొద్దు నిద్ర వీడలేదు. మెడికల్ షాపుల్లో ఏం అమ్ముతున్నారనేది తెలుసుకోవడానికి తనిఖీలు చేయలేదు. మెడికల్ షాపుల్లో మత్తు ఇంజెక్షన్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనడానికి.. తిరుపతి ఘటన మరో నిదర్శనం.
పెయిన్ కిల్లర్లు, మత్తు ఇంజెక్షన్స్ వల్ల అనారోగ్య సమస్యలు
మరోవైపు పెయిన్ కిల్లర్లు సహా ఇతర మత్తు పదార్థాలను ఇంజెక్షన్ రూపంలో వాడటం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. మత్తు ఇంజెక్షన్లు అధిక మోతాదులో తీసుకోవటం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడం, కోమాలోకి వెళ్లడం.. ఒక్కోసారి మృతిచెందే అవకాశం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. మత్తు ఇంజెక్షన్లకు ఒక్కసారి బానిస అయితే, దాన్ని వదిలించుకోవడం చాలా కష్టమని చెప్తున్నారు. మత్తు ఇంజెక్షన్ల వల్ల రక్తనాళాలు దెబ్బతినడంతో పాటు.. గుండె సమస్యలు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయని డాక్టర్లు చెప్తున్నారు. డిప్రెషన్, యాగ్జైటీ వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఒంటరిగా ఉండాలని అనిపించడం, ఆలోచనల్లో మార్పు, చిన్న విషయాలకు కోపం రావడం ఆత్మహత్య చేసుకోవాలనిపించడం.. వంటివి ఎదురవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
Also Read: భారత్‌కు భారీ షాక్.. ఆ ఎగుమతులు నిలిపివేసిన చైనా..! మనకు స్విఫ్ట్ కార్ కష్టమే?
యువకుల్లో దురాలోచనలు రావడానికి కూడా మత్తు పదార్థాలే కారణం
పిల్లలకు మత్తు పదార్థాల గురించి.. ఇవి తీసుకుంటే కిక్కు ఎక్కుతుందనే విషయం ఎలా తెలిసుంటుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న? పలానా మెడిసిన్ కావాలని పిల్లలు వెళ్లి అడిగితే ఆరా తీయకుండా విచ్చల విడిగా అమ్మడం మెడికల్ షాపు నిర్వాహకులు చేస్తున్న అతిపెద్ద తప్పు. పిల్లల్ని కనడమే కాదు.. వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏమేం పనులు చేస్తున్నారని ఓ కంట కనిపెట్టాల్సిన బాధ్య తల్లిదండ్రులపైనే ఉంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం అధికారులదే.