Kakinada: కూటమి ప్రభుత్వానికి కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చిక్కారా? గడిచిన దశాబ్ద కాలంగా బిల్లులు ఎందుకు పెండింగ్‌లో పెట్టారు? ఏకంగా గోదావరి నీటితో బిజినెస్ చేశారా? బకాయిల విషయంలో ముఖం చాటేస్తున్నారా? మళ్లీ అధికారుల ఇచ్చిన నోటీసులకు ఆయన రియాక్ట్ అవుతారా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై ఒంటికాలిపై లేచిన ఆయన ఏడాదిగా సైలెంట్ అయ్యారు. ఆయనకు అనుచరులు ఫోన్ చేస్తే ఔటాఫ్ సర్వీసు ఏరియా అని వస్తుందట. ఇంతకీ ద్వారంపూడి అసలు మేటరేంటి? ద్వారంపూడి వ్యాపారాల గురించి చెప్పనక్కర్లేదు.
కాకినాడ పేరు ఎత్తగానే ఆయనే ముందుకొస్తారట. ఏ వ్యాపారం పేరు విన్నా ఆయన గుర్తుకు వస్తారట. ద్వారంపూడి చాన్నాళ్లుగా మంచి నీళ్ల వ్యాపారం చేస్తున్నారు. గడిచిన పుష్కరకాలంగా ప్రభుత్వానికి ఒక్క రూపాయి కట్టలేదు. ఫలితంగా ఆ బకాయిలు ఇప్పుడు దాదాపు రూ.13.84 కోట్లకు చేరింది.
తాజాగా మరోసారి అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను వీలైనంత త్వరగా కట్టాలని నోటీసులు ఇచ్చారు. మరి నోటీసులకు ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కాకినాడ సిటీకి సమీపంలో ఎరువుల కర్మాగారం, ఆయిల్ ఫ్యాక్టరీలు, సీ పోర్టు ఉన్నాయి. ఆయా పరిశ్రమలకు నీటి కావాలి.
ALSO READ: కారులో పెద్దారెడ్డి, బయట పోలీసులు, తాడిపత్రిలో హైటెన్షన్
బాయిలర్ల కూలింగ్ మొదలు గ్రీన్ బెల్ట్ నిర్వహణ, ఉద్యోగులు, కార్మికుల అవసరాలకు నీళ్లు చాలా అవసరం. నిత్యం వచ్చిపోయే నౌకల్లో అవసరాలకు నీళ్లు పెద్దఎత్తున వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక, ఓడరేవు అవసరాలు తీర్చేలా నీటిపారుదలశాఖ గోదావరి నీటిని వివిధ ప్రైవేటు సంస్థలకు పైపులైన్ల ద్వారా కేటాయిస్తోంది.
ఆయా సంస్థలు నీటిని తీసుకుని వివిధ పరిశ్రమలకు అమ్మకాలు సాగిస్తున్నారు. నీటి సరఫరా చేసినందుకు ఆయా సంస్థల నుంచి నామమాత్రపు చార్జీలను వసూలు చేస్తోంది చేస్తోంది. ద్వారంపూడి తన కుటుంబసభ్యుల పేరుతో గోదావరి నీటిని తీసుకుంటున్నారు. తన ఏజెన్సీ ద్వారా ప్రతీరోజు 0.25ఎంజీడీ నీటిని పైపులైన్ల ద్వారా తీసుకుంటున్నారు.
శుద్ధి చేసిన నీటిని ద్వారంపూడి.. కాకినాడ సీపోర్టు, అక్కడికి వచ్చే నౌకలకు విక్రయిస్తున్నారు. మిగతా ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశారు అధికారులు. చాలా కంపెనీలు పెండింగ్ బకాయిలను చెల్లించాయి.. చెల్లిస్తున్నాయి కూడా. ఈ విషయంలో ద్వారంపూడి నుంచి ఎలాంటి ఉలుకుపలుకు లేదు.
ఎగవేతను గుర్తించి అధికారులు గత నెల 27న నోటీసులు ఇచ్చారు. మూడు వారాలు గడుస్తున్నా ఎలాంటి స్పందన రాలేదు. బాకీలు చెల్లించకుంటే ఆయన ఏజెన్సీకు నీటి సరఫరా నిలిపి వేయాలని ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ద్వారంపూడి కంపెనీ నీటిని లీటరు 10 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తోంది.
దాన్ని శుద్ధి చేసి 30 రూపాయలకు విక్రయం చేస్తోంది. పోర్టు, నౌకలు, వివిధ పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ఒక్క పైసా ప్రభుత్వానికి కట్టకుండా నీళ్ల వ్యాపారం చేస్తున్నారు. ఇప్పటికీ ఆయన స్పందించకుంటే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.