రీకాలింగ్ మేనిఫెస్టోపై విభేదాలు
వైసీపీ నేత పెద్దారెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రిలో “చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్” కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు టీడీపీ హయాంలో నెరవేరని హామీల గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతో పెద్దారెడ్డి ముందుకొచ్చారు. అయితే ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, సభను అడ్డుకుంటానని తేల్చి చెప్పారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటుగా స్పందిస్తూ, “తాడిపత్రిలో పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు తప్ప మిగతా వారెవరైనా సభలు పెట్టొచ్చు. కానీ పెద్దారెడ్డికి ఈ పట్టణంలో ప్రజా కార్యక్రమాలు నిర్వహించటానికి హక్కు లేదు” అని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో జిల్లాలోని రాజకీయ పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది.
పోలీసులు అలర్ట్ – తాడిపత్రిలో అనుమతి లేని సభ
రెండు పార్టీల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా తాడిపత్రిలో పెద్దారెడ్డికి సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో, పెద్దారెడ్డి తన సొంత గ్రామమైన తిమ్మంపల్లికి మకాం మార్చారు.
తిమ్మంపల్లిలో హౌస్ అరెస్ట్ అవకాశాలు
తిమ్మంపల్లిలో సభకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో, జేసీ ప్రభాకర్‌రెడ్డితో మరోసారి మాటల యుద్దం జరగవచ్చన్న ఆందోళన నెలకొంది. దీంతో పోలీసులు పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొంతమంది వైసీపీ కార్యకర్తలు ఇప్పటికే తిమ్మంపల్లిలో చేరినట్లు సమాచారం. సభకు అనుమతి ఉందా? లేదన్నది అధికారికంగా తెలియరాలేదు కానీ, పోలీసులు మాత్రం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
పోలీసుల తర్జన భర్జన
రెండు పార్టీల మధ్య విభేదాల వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని.. పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా తాడిపత్రి, తిమ్మంపల్లి ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. పరిస్థితిని నియంత్రించేందుకు, ముఖ్యంగా పెద్దారెడ్డి కార్యక్రమాన్ని ఎదుర్కొనే విధానంపై అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
Also Read: ఏపీలో ప్రజలకు శుభవార్త, నిర్మాణాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, చాలా సులువు
రాజకీయ వ్యాకులత, భవిష్యత్ సంకేతాలు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. తిరిగి ప్రజల ముందుకు రావాలన్న సంకల్పంతో.. కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యతిరేక స్పందన ఆందోళన కలిగిస్తోంది. ఇది భవిష్యత్‌లో తాడిపత్రి నియోజకవర్గంలో.. ఎన్నికలకు ముందు గణనీయమైన రాజకీయ ఎత్తుగడలుగా మారే అవకాశముంది.