Earthquake in Prakasam District: ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్పంగా భూ ప్రకంపనల ప్రభావం గురువారం కనిపించింది. 2024 సంవత్సరం డిసెంబర్ నెలలో ఒకేసారి మూడుసార్లకు పైగా భూ ప్రకంపనలు రావడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తాజాగా మరో మారు స్వల్పంగా భూమి కంపించడంతో, వరుస భూ ప్రకంపనలకు గల కారణాలను అన్వేషించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రకాశం జిల్లా ముండ్లమూరులో గురువారం మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అది కూడా మధ్యాహ్నం 1.43 గంటల సమయంలో భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన చెందారు. ముండ్లమూరులో డిసెంబర్ 21 నుండి వరుసగా మూడు రోజులు భూ ప్రకంపనులు రావడంతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. అయితే ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలపై శాస్త్రవేత్తలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అందుకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
Also Read: AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్.. పిఠాపురంపై కీలక నిర్ణయం
గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతం కావడంతో భూకంపాలు వచ్చే అవకాశాలు స్వల్పంగా ఉంటాయని, ఈ విషయంపై ప్రజలు ఆందోళన చెందకుండా ఉండాలంటూ శాస్త్రవేత్తలు కోరుతున్నారు. అనవసరంగా ప్రజలు భయాందోళన చెంది మానసికంగా ఇబ్బందులు పడవద్దని తెలిపారు. ఈ దశలో మరోమారు గురువారం సైతం స్వల్పంగా కంపించడంతో ప్రజలు గృహాల నుండి బయటకు వచ్చి చర్చలు సాగించిన పరిస్థితి. ఏది ఏమైనా స్వల్పంగా భూమి కంపించడంపై, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.