Mukesh Kumar Meena on AP Polling Percentage: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. కాకపోతే పోలింగ్ ఎంత శాతం అనేదానిపై ఆసక్తి నెలకొంది. పోలింగ్‌పై చిన్న క్లారిటీ ఇచ్చారు ఏపీ ఈసీ ముకేష్‌కుమార్ మీనా. సోమవారం అర్థరాత్రి 12 గంటలవరకు దాదాపు 78.25 శాతం పోలింగ్ నమోదు అయినట్టు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌తో కలిపితే మొత్తం 79 శాతంపైనే ఉంటుందని సూచనప్రాయంగా తెలిపారు.
ఓవరాల్‌గా 81శాతం నమోదు కావచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత పూర్తి వివరాలు వస్తాయన్నారు ఏపీ ఈసీ. మంగళవారం కాకపోతే బుధవారం నాటికి పూర్తిగా పోలింగ్ శాతం తెలిసే ఛాన్స్ ఉంది. 2019 ఎన్నికల్లో 79.02 శాతం నమోదు కాగా, పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి 79.08 శాతంగా ఉందన్నారు.
పోలింగ్ శాతంపై అధికార నేతల్లో గుబులు మొదలైంది. పోలింగ్ శాతం తగ్గితే తమ గెలుపు సునాయాశమే నని కొందరు నేతలు చెబుతున్నారు. అది పెరిగితే ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ ఉందని ఫ్యాన్ పార్టీ నేతలు అంతర్గతంగా చెబుతున్నమాట. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు వైసీపీకి చెందిన ముఖ్య నేతలు మీడియాతో మాట్లాడిన మాటలను గమనిస్తే ఓటమి భయం కనిపిస్తోందని అంటున్నారు టీడీపీ నేతలు.
Also Read: AP polling percentage: ఏపీలో 81.86 శాతం పోలింగ్, అత్యధికం దర్శి, అత్యల్పం తిరుపతి
సోమవారం పోలింగ్ అవుతుండగానే రాత్రి సజ్జల మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి సానుకూలత వల్లే ఓటింగ్ శాతం పెరుగుతోందని కొత్త భాష్యం చెప్పారు. పోలీసులు, అబ్జర్వర్లు టీడీపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరించారని మాజీమంత్రి అనిల్‌కుమార్ చెబుతున్న మాట. టీడీపీ గట్టిగా ఉన్న ప్రాంతాల్లో అసలు పోలీసులు లేరంటున్నారు. మూడు వేల ఓటర్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు ఉంటారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ బలంగా ఉన్న దగ్గర ఒక బెటాలియన్ పోలీసులను మొహరించారని వివరించారు.
పోలీసుల తీరు టీడీపీకి అనుకూలంగా ఉందని ఆరోపణలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. తాము ప్రభుత్వంలో ఉన్నామో లేదో అర్థం కాలేదన్నారు. పోలింగ్ పర్సంటేజ్ పెరగటంపై అంబటి కొత్త నిర్వచనం చెప్పారు. తాను పోలింగ్‌కు వెళ్లేసరికి ఓటర్లు బారులు తీరారని గుర్తు చేశారు. మహిళలు, వృద్ధులు ఉదయాన్నే పోలింగ్‌స్టేషన్‌కు వచ్చారన్నారు. పోలింగ్ శాతం పెరిగితే అది వైసీపీకి పాజిటివ్ మనసులోని మాట బయటపెట్టారు అంబటి. ఈ లెక్కన నేతల మాటలు గమనిస్తే, ఓటమి ఖాయమన్నది స్పష్టంగా కనిపిస్తోందన్నది సైకిల్, గాజు గ్లాసు నేతల నుంచి బలంగా వినిపిస్తున్నమాట.