ED Raids: ఢిల్లీ, కోల్‌కతాల్లో ఏకకాలంలో జరిగిన ఈడీ సోదాలు భారీ ఆర్థిక నేరాన్ని బయటపెట్టాయి. కస్టమైజ్డ్ సాఫ్ట్‌వేర్ దిగుమతుల ముసుగులో ఏకంగా రూ. 1,500 కోట్ల నిధులను విదేశాలకు అక్రమంగా తరలించిన పెద్ద హవాలా రాకెట్‌ను విశాఖపట్నం ఈడీ సబ్‌జోనల్ అధికారులు గుట్టురట్టు చేశారు.
నకిలీ ఇన్వాయిస్‌లతో బ్యాంకుల ద్వారా బదిలీలు
ఈ అక్రమ రవాణా వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉంది. నిందితులు నకిలీ పత్రాలు, ఫోర్జరీ ఇన్వాయిస్‌లను సృష్టించి, బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఆధారం చేసుకుని విదేశీ ఖాతాలకు కోట్లాది రూపాయల నగదును బదిలీ చేశారు. కేవలం సాఫ్ట్‌వేర్ దిగుమతుల పేరు చెప్పి అధికారుల కళ్లు గప్పి ఈ దందాను సాగించారు.
షెల్ కంపెనీల నెట్‌వర్క్
విశాఖ ఈడీ జరిపిన సమగ్ర విచారణలో వడ్డీ మహేష్, అతని తండ్రితో పాటు మరికొందరు ముఠాగా ఏర్పడి ఈ దందా నడుపుతున్నట్లు తేలింది. వీరంతా కోల్‌కతా కేంద్రంగా పలు షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీల ఖాతాల ద్వారానే నల్లధనాన్ని హవాలా రూపంలో విదేశాలకు పంపించారు.
చైనా, సింగపూర్‌లకు నిధులు
ఈ సోదాల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం సింగపూర్, హాంకాంగ్, చైనాలోని ఐదు కంపెనీలకే రూ. 569.03 కోట్లు బదిలీ చేసినట్లు అధికారులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. మిగిలిన నిధుల బదిలీలపై , ఈ కుంభకోణంలో ఉన్న మరికొందరు కీలక పాత్రధారులపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది.
Also Read: అప్పులు తీర్చేందుకు చెయిన్ స్నాచింగ్.. బైక్ మెకానిక్ అరెస్ట్!