YS Sharmila: కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం జరిగిన స్థానిక ఎన్నికల పోలింగ్ సరళిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు ప్రభుత్వం తీవ్ర అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రతి దశలోనూ రిగ్గింగ్‌కు పాల్పడ్డారని విమర్శించారు. రిగ్గింగ్ అనే దానికి కూటమి ప్రభుత్వం ఒక కొత్త నిర్వచనం ఇచ్చిందన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు సౌత్ బిహార్ రాజకీయాలను గుర్తుకు తెస్తోందని ధ్వజమెత్తారు. నామినేషన్లు వేయనీయకుండా, ప్రజలను ఓటేయనీయకుండా భయాందోళనలు సృష్టించారని షర్మిల దుయ్యబట్టారు.
జనాల్లో మద్దతు లేకపోవడంతోనే కూటమి నాయకులు స్థానిక ఎన్నికల్లో అడ్డదారులు తొక్కారని షర్మిల ఆరోపించారు. ‘ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా కూటమి పరిస్థితి తయారైంది. స్వతంత్రంగా గెలిచే సత్తా లేక బూత్ క్యాప్చరింగ్‌లు, దొంగ ఓట్లతో గెలవాలని ప్రయత్నించారు. ఇది నిజంగా సిగ్గుచేటు. ప్రభుత్వంలో ఉన్న ఓటమి భయానికి ఇది అద్దం పడుతోంది. ఒకవైపు పారదర్శకత అని నీతులు చెబుతూ.. మరోవైపు విపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం?’ అని షర్మిల ప్రశ్నించారు.
నామినేషన్లలో రిగ్గింగ్, ఎన్నికల్లో రిగ్గింగ్. రిగ్గింగ్ అనేదానికి కొత్త నిర్వచనం కూటమి ప్రభుత్వం. రిగ్గింగ్ చేయడంలో సౌత్ బీహార్ ను మరిపించిన ఘనుడు మన @ncbn ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు, జనాల్లో మద్దతు కనిపించక, గెలిచే సత్తా లేక, బూత్ క్యాప్చరింగ్‌లు, దొంగ ఓట్లతో గెలవాలని చూడటం కూటమి పార్టీలకు నిజంగా సిగ్గుచేటు. ఇది ప్రభుత్వ అభివృద్ధి బలం కాదు.. ఓటమి భయానికి పరాకాష్ట.
ఎన్నికల సంఘాన్ని బానిస చేసి, ప్రజల తీర్పును అపహాస్యం గావించి, ప్రజాస్వామ్యాన్ని చంపిన తీరు దేశ ఎన్నికల చరిత్రలోనే ఇదొక చీకటి అధ్యాయం. నిజంగా ప్రజాబలమే ఉంటే రిగ్గింగ్ చేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకు ?
ఒకవైపు ప్రజాస్వామ్యం, పారదర్శకత అని నీతులు చెబుతూ.. మరోవైపు అధికారాన్ని అడ్డుపెట్టి ఎన్నికల వ్యవస్థను శాసించడం, విపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం ఏ రకమైన పారదర్శకత? నామినేషన్లు వేయకుండా, ఓటేయనీయకుండా అడ్డుకోవడం ఎక్కడి ప్రజాస్వామ్యం ?
ప్రశాంతతో కాదు.. రాష్ట్రంలో భయానక వాతావరణంలో జరిగిన ఎన్నికలు ఇవి. ఎటు చూసినా దాడులు.. దౌర్జన్యాలు.. ఇదొక గెలుపు అంటారా? ఇదా ఎన్నికలు నిర్వహించే తీరు ? కూటమి అరాచకాలపై రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి.
రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం. బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లు మరియు దౌర్జన్యాలు జరిగినట్లు ఆధారాలు (వీడియోలు/ఫొటోలు) ఉన్న ప్రతి పోలింగ్ కేంద్రంలో తక్షణమే పోలింగ్‌ను రద్దు చేసి, రీ-పోలింగ్ నిర్వహించాలి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన లైవ్ వెబ్‌కాస్టింగ్ మరియు సీసీటీవీ ఫుటేజ్‌లను నిష్పక్షపాతంగా స్క్రీనింగ్ చేయాలి. ఓటరు కాకుండా ఇతరులు పదే పదే లోపలికి వెళ్లినట్లు లేదా ఓటర్లను ప్రభావితం చేసినట్లు ఫుటేజ్‌లో తేలితే ఆయా బూత్‌ల ఫలితాలను నిలిపివేయాలి. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, అక్రమాలను చూస్తూ ఊరుకున్న రిటర్నింగ్ అధికారులు (ROs), ప్రిసైడింగ్ అధికారులు (POs) మరియు పోలీసులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
@JaiTDP @JanaSenaParty @BJP4Andhra
@INC_Andhra @pvmohanINC
— YS Sharmila (@realyssharmila) November 2, 2026
మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించలేకపోయిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. వ్యవస్థలను బానిసలుగా మార్చుకుని ప్రజల తీర్పును అపహాస్యం చేశారని మండిపడ్డారు. ఇది దేశ ఎన్నికల చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయమని అభివర్ణించారు. నిజంగా ప్రజాబలమే ఉంటే ఇన్ని దౌర్జన్యాలు, రిగ్గింగ్‌లు చేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వస్తుందని కూటమి నేతలను నిలదీశారు.
Also Read: ఇంటికి హైటెక్ సెక్యూరిటీ.. మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఫేస్ ఐడీ స్మార్ట్ లాక్స్ ఇవే!
ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (SEC) ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లు, దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోల ఆధారాలు ఉన్న ప్రతి పోలింగ్ కేంద్రంలో తక్షణమే ఎన్నికను రద్దు చేసి, రీ-పోలింగ్ పెట్టాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోని లైవ్ వెబ్‌కాస్టింగ్, సీసీటీవీ ఫుటేజ్‌లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని ఓటర్లు కాకుండా ఇతరులు లోపలికి వెళ్లి ప్రభావితం చేసినట్లు తేలితే ఆయా బూత్‌ల ఫలితాలను నిలిపివేయాలని పట్టుబట్టారు. మరోవైపు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి అక్రమాలను అడ్డుకోక చూస్తూ ఊరుకున్న రిటర్నింగ్ అధికారులు (ROs), ప్రిసైడింగ్ అధికారులు (POs), సంబంధిత పోలీసులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.
Also Read: శాలరీ అకౌంట్ vs సేవింగ్స్ అకౌంట్.. రెండింటికీ తేడా ఏంటి? ఏ ఖాతా వల్ల ఎక్కువ లాభం?