AP Politics: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ మరో వారంరోజుల్లో పురుడు పోసుకోనుంది. రాజకీయ పార్టీలో అసంతృప్తులను తన వైపు తిప్పు కునేందుకు భారీగా స్కెచ్ వేశారు విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో టీడీపీకి దూరంగా ఉన్న తిరుపతి నేతపై దృష్టి సారించారు. ఈనెల 11న వీఎస్ఆర్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఏపీలోని వివిధ రాజకీయ పార్టీల్లో అసంతృప్త నేతలను తనవైపు తిప్పుకునేందుకు గాలం వేస్తున్నారు విజయసాయిరెడ్డి. తిరుపతి నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ.. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆ పార్టీలో ఒంటెద్దు పోకడలు తనకు నచ్చలేదని, దీని కారణంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పోయిననెల తిరుమల వచ్చిన విజయసాయిరెడ్డి, ఓవీ రమణతో టచ్‌లోకి వెళ్లారు.
తన పార్టీలోకి రావాలని ఆహ్వానించడంతో ఆయన సానుకూల సంకేతాలు ఇచ్చేశారు. ఈ క్రమంలో తాను విజయసాయిరెడ్డి ఏర్పాటు చేయనున్న పార్టీలో చేరుతానని వెల్లడించారు. తిరుపతిలో టీడీపీలో కీలక నేతగా ఎదిగారు ఓవీ రమణ. టికెట్ ఆశించిన రాకపోవడంతో 2019 ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరారు. మరుసటి ఏడాది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారనే కారణంతో సస్పెండ్ చేసింది బీజేపీ.
మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. ఆయనకు టీడీపీ నుంచి అవకాశాలు సన్నగిల్లడంతో గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. గతంలో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పని చేశారు. ఈనెల 11న విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ఘనంగా ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నారు. కూటమిలో పొత్తుల్లో భాగంగా పలువురు నేతలకు టికెట్లు దక్కలేదు. అసెంబ్లీ సీట్ల విషయం పక్కనబెడితే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలామందికి టికెట్లు లేవు. ఈ క్రమంలో అలాంటి నేతలపై ఫోకస్ చేశారు విజయసాయిరెడ్డి.
ALSO READ: రాప్తాడు ఘటన నిందితుడు.. ఆపరేషన్ చేసి బులెట్లు తొలగింపు, ప్రత్యేక భద్రత మధ్య చికిత్స
అన్నట్లు వైసీపీ నుంచి పలువురు నేతలు విజయసాయిరెడ్డితో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే వారంతా పార్టీ మారుతామని క్లియర్‌గా సంకేతాలు ఇవ్వలేదట. ఆయా నేతలను ఒప్పించే పనిలో సాయిరెడ్డి ఉన్నట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈనెల 11 కొత్త పార్టీ పెట్టాలని భావిస్తున్న వీఆర్ఎస్, ఆయన వెంట ఎంతమంది నేతలు వస్తారో చూడాలి.