Pulivendula Repolling: మాజీ సీఎం జగన్ చెప్పినట్టే జరిగిందా? ఎట్టకేలకు రీపోలింగ్‌కు ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఇప్పుడైనా ఆయన సోమవారం పులివెందులకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఆదివారం పోలింగ్‌కు పులివెందుల వచ్చినా ఓటు వేయకుండానే వెనుదిరిగారు.
ఆదివారం జరిగిన కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి ఇచ్చారు.6 పట్టణ స్ధానిక సంస్ధల్లో 12 పోలింగ్ బూత్‌లకు రీపోలింగ్ ఎస్ఈసీ అనిల్‌చంద్ర పునేఠా గ్రీన్ ఇచ్చారు. దీంతో సోమవారం ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ బూతుల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఓటర్లు పోలింగ్ బూతులకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది.
కడప నగరపాలక సంస్థ, జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీల పరిధిలో 8 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం అంటే నవంబర్ 2న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. పులివెందులలోని 1,3,7,8 వార్డులలో రీపోలింగ్ జరుగుతోంది. కడప నగరపాలక సంస్థలోని 15వ వార్డు పరిధిలో ఓ పోలింగ్ కేంద్రం, జమ్మలమడుగు మున్సిపాలిటీలోని 3, 17, 29వ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది.
అనంతపురంలోని 30వ వార్డులో 30/3 పోలింగ్ స్టేషన్‌కు రీ పోలింగ్ సోమవారం ఉదయం నుంచి 7 గంటల నుంచి ప్రారంభమైంది. దీనికితోడు ప్రకాశం జిల్లా చీమకుర్తి లోని 14వ వార్డులో 14/1 పోలింగ్ స్టేషన్, మాచర్లలో వార్డు నం.23లో 23/1, 23/2 పోలింగ్ స్టేషన్లకు రీ పోలింగ్ మొదలైంది. ఇక కడప జిల్లా విషయానికి వద్దాం.
ALSO READ: దూసుకొస్తున్న మురసు తుఫాను.. దక్షిణ ఏపీ వైపు చూపు, తెలంగాణలో భారీ వర్ష సూచన
మీడియా ముందు జగన్ చెప్పినట్టుగానే జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు పులివెందులలో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు అవకాశం ఇచ్చారు ఎస్ఈసీ. ఆదివారం పులివెందులకు వచ్చినా ఓటు వేయకుండానే మళ్లీ బెంగుళూరుకు జగన్ వెళ్లిపోయారు. ఈ క్రమంలో సోమవారం ఓటు హక్కు వినియోగించుకునేదుకు వస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. కానీ పులివెందుల వైసీపీ నేతలు మాత్రం జగన్ ఓటు వేయరని అంటున్నారు. సోమవారం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాప్తాడు బాధితురాలు బాలికను పరామర్శించనున్నారు. ఈ క్రమంలో పులివెందులకు రాకపోవచ్చని అంటున్నారు. అదే జరిగితే ఎప్పుడు లేని విధంగా ఓటు హక్కు వినియోగించు కోకుండా దూరంగా ఉండబోతున్నారు వైసీపీ అధినేత.