IG Ravi Krishna: అదొక ఫ్యాక్షన్ గ్రామం. ఆ ఊరు పేరెత్తితే చాలు గజగజ వణికి పోవాల్సిందే. ఈ మాట గతం. ఇప్పుడు ఆ గ్రామం మారింది. చేతిలో కత్తులు కటార్లు పోయి, నాగల్లు చేతబట్టారు. ఇంతలా ఆ ఊరిలో మార్పు వచ్చింది మాత్రం ఆ ఒక్కరితోనే. ఆయన చేసిన పనికి ఆ ఊరే మారింది. ఫ్యాక్షన్ కు పుట్టినిల్లుగా గల గ్రామం రూపు మారింది. నేడు సంక్రాంతి పండుగను గ్రామం మొత్తం ఏకమై చేసుకుంటోంది. ఆ గ్రామమే కర్నూల్ జిల్లా కప్పట్రాళ్ల గ్రామం. ఇంతకీ వీరిలో మార్పు తెచ్చింది మాత్రం ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామం అంటే తెలియని వారే ఉండరు. ఫ్యాక్షన్ గ్రామాలలో మొదటి జాబితాలో ఉండే గ్రామమే ఇది. ఎప్పుడు చూసినా దాడులు, అల్లర్లు ఈ గ్రామానికి నిదర్శనంగా చెప్పుకునేవారు. అలాంటి సమయంలోనే కర్నూలు జిల్లా ఎస్పీగా ఆకే రవికృష్ణ బాధ్యతలు చేపట్టారు. కప్పట్రాళ్ల గ్రామం గురించి పూర్తిగా వివరాలు తెలుసుకున్న రవికృష్ణ, వెంటనే గ్రామాన్ని సందర్శించి దత్తతకు తీసుకున్నారు. ఈ గ్రామానికి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి రావాలన్నా భయపడే రోజులు అవి.
అటువంటి పరిస్థితుల్లో ఎస్పీగా గల రవికృష్ణ గ్రామంలో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు సైతం భయపడే పరిస్థితి ఉండడంతో, ఉపాధ్యాయులకు భరోసాను అందించి పాఠశాల బాట పట్టేలా చేశారు ఈయన. ఒకటి కాదు రెండు కాదు గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా, స్వయంగా కలుగజేసుకొని పరిష్కరించడం ఈయన నైజం. అందుకే ఈ గ్రామానికి, రవి కృష్ణకు ఎనలేని అనుబంధం కొనసాగుతోంది. ఈ దశలో తమ గ్రామంలో జరిగే సంక్రాంతి సంబరాలకు రావాలని కప్పట్రాళ్ల గ్రామస్తులు ఆయనను కోరారు.
ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం ఐజీగా గల రవి కృష్ణ కూడ సమ్మతించి సోమవారం కప్పట్రాళ్ల గ్రామానికి చేరుకున్నారు. తమలో మార్పు తీసుకువచ్చి, గ్రామ అభివృద్ధికి సహకరించిన ఐపీఎస్ అధికారి రవికృష్ణకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అంతేకాదు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామంలో ముగ్గుల పోటీలు, యువకులకు కబడ్డి, షటిల్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ.. కప్పట్రాళ్ల గ్రామస్తులు చాలా మంచి వారంటూ, సమాజ హితం కోసం అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువకులు మత్తుకు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు.
Also Read: TTD News: అదేమీ లేదు.. అన్నీ అవాస్తవాలే.. టీటీడీ చైర్మన్, ఈవో క్లారిటీ
ఈ గ్రామంలో సంక్రాంతి పండుగ జరుపుకోవడం తన సొంత గ్రామంలో జరుపుకున్న ఆనందం కలిగిందని రవికృష్ణ అభిప్రాయపడ్డారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ గ్రామ అభివృద్ధికి రవికృష్ణ ఐపీఎస్ ఎంతో కృషి చేశారని, ఫ్యాక్షన్ గ్రామాన్ని దత్తత తీసుకొని రూపురేఖలు మార్చారన్నారు. ఆయన రాకతోటే అసలు సిస్థలైన సంక్రాంతి పండుగ తమ గ్రామానికి వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. తమ గ్రామ శ్రీమంతుడు అంటూ వారు కొనియాడారు. ఏది ఏమైనా ఓ ఐపీఎస్ అధికారి, గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయడంతో పాటు వారిలో మార్పు తీసుకురావడం అభినందించదగ్గ విషయం. మార్పు చెందిన గ్రామస్తులను కూడా తప్పక అభినందించాల్సిందే. మరి కప్పట్రాళ్ల శ్రీమంతుడు ఐజి ఆకే రవి కృష్ణకు జేజేలు పలికేద్దాం.
కప్పట్రాళ్లలో రియల్ శ్రీమంతుడు..
కర్నూలు జిల్లా దేవనకొండా మండలం కప్పట్రాళ్ల గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఈగల్ ఐజీ ఆర్.కె.రవికృష్ణ కుటుంబం
రవికృష్ణను ఎద్దుల బండిపై ఎక్కించి పువ్వులు చల్లుతూ గ్రామంలోకి స్వాగతం పలికిన ప్రజలు
ఫ్యాక్షన్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న… pic.twitter.com/jduyrK97fn
— BIG TV Breaking News (@bigtvtelugu) January 13, 2025