TTD News: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన గురించి సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు హుటాహుటిన తిరుపతికి వచ్చిన క్రమంలో, టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు హల్చల్ చేశాయి. ఈ ఘటనకు వారిద్దరి మధ్య ఉన్న విభేదాలే కారణమని ప్రచారం సైతం సాగింది. తాజాగా తమ మధ్య గల విభేదాలపై ఓ క్లారిటీ ఇచ్చారు టీటీడీ చైర్మన్, ఈవో.
సోమవారం తిరుమలలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ బీ.ఆర్ నాయుడు మాట్లాడుతూ.. జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన ఘటన అత్యంత దురదృష్టవంతమైన ఘటనగా పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మృతి చెందిన కుటుంబాలకు, గాయపడిన వారికి సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం పరిహారం అందజేశామని తెలిపారు.
బోర్డు సభ్యులతో ఏర్పాటు చేసిన రెండు బృందాలు బాధితులకు పరిహారం అందజేశాయని, కొన్ని ప్రసార మాధ్యమాల్లో సామాజిక మాధ్యమాలలో టిటిడి పై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాదిమంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయాలు కాబట్టి, వార్తలు ప్రచురించే సమయంలో ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని చైర్మన్ సూచించారు. మీడియా చేతిలో ఉందని ఇష్టానుసారం అసత్య వార్తలు, ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలక మండలికి అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు, అందరం సమన్వయంతో భక్తులకు మెరుగన్న సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఆ ఒక్క సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని భక్తులు తమకు తెలుపుతున్నట్లు చైర్మన్ తెలిపారు.
అలాగే టీటీడీ ఈవో శ్యామలరావు సైతం ఇదే విషయంపై స్పందించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనధికార వ్యక్తుల ప్రమేయం టీటీడీలో పెరిగిందన్న వార్తలను ఈవో ఖండించారు. వివిధ రంగాల్లో నిపుణులు అనుభవజ్ఞులైన వారితో సంప్రదింపులు సూచనలు తీసుకోవడం ఎప్పటి నుండో ఉందని, అంతమాత్రాన ప్రైవేటు వ్యక్తులకు టీటీడీ పరిపాలన అప్పగించేశామని అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. వాస్తవాలు తెలుసుకునే ప్రసారం చేయాలని, వైకుంఠ ద్వార దర్శన పని ఒత్తిడి వల్ల ఇలాంటి వార్తలను తాను పట్టించుకోలేదంటూ ఈవో అన్నారు.
Also Read: Sankranti Special: సంక్రాంతికి అందరూ స్వగ్రామాల వైపు.. కానీ ఆ గ్రామస్థులు మాత్రం..?
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తాను విభేదించానని వచ్చిన వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారం అంటూ కొట్టి పారేశారు, తొక్కిసలాటకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పక ఉంటాయని, ఆరు నెలల్లో అనేక మార్పులు చేశామన్నారు. ప్రక్షాళనలో భాగంగా కల్తీ నెయ్యి వినియోగాన్ని గుర్తించి, కల్తి నెయ్యి సరిపడా చేసిన సరఫరా దారులపై చర్యలు తీసుకున్నట్లు ఈవో తెలిపారు. వేల సంఖ్యలో ఉన్న ఆన్లైన్ బ్రోకర్ల బెడదను నివారించామని, తనకు చైర్మన్ తో కానీ, అదనపు ఈవో తో కానీ విభేదాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పూర్తి అవాస్తవమంటూ ఈవో పేర్కొన్నారు. అందరి సమన్వయంతో తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండ, ముందుకు వెళ్తున్నామంటూ ఈవో తెలిపారు.