Tragic Accident in Eluru District 7 Killed: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున మినీలారీ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కొంతమంది వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి రాత్రి జీడిపిక్కల లోడుతో మినీ లారీ బయలుదేరింది. ఈ లారీ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆరిపాటి దిబ్బలు, చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలోకి రాగానే మినీలారీ అదుపుతప్పింది. దీంతో వెంటనే పక్కన పంటబోదెలోకి మినీలారీ దూసుకెళ్లి బోర్లాపడింది.
ప్రమాద సమయంలో మినీలారీలో 9 మందితో డ్రైవర్ ఉన్నాడు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే మినీలారీలో ఉన్న జీడిపిక్కల బస్తాలు అందులో ఉన్న వారిపై పడ్డాయి. దీంతో మినీలారీ బోల్తా పడడంతో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకొని ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికిగా తీవ్ర గాయలు కాగా.. డ్రైవర్ పరారయ్యాడు. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో తాడిమళ్లకు చెందిన ఘంటా మధును గుర్తించగా.. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య(40), తమ్మిరెడ్డి సత్యనారాయణ(45), పి.చినముసలయ్య(35), కత్తవ కృష్ణ(40), కత్తవ సత్తిపండు(40), తాడి కృష్ణ(45), అలాగే నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్ ఉన్నారు. ఈ ఘటనపై డీఎస్పీ దేవకుమార్, ఎస్‌ఐలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం విచారణ చేపట్టారు.
Also Read: రెడ్ బుక్ పాలన అంటే ఇదే కదా..?: అంబటి
ఇదిలా ఉండగా, ఏలూరు జాతీయ రహదారి ఆశ్రమం ఆస్పత్రి సమీపంలో హైదరాబాద్ నుంచి ఒడిశా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్ ను ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడగా.. మరో 15మందికి గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఈ ప్రమాదంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుంచి ఒడిశా వెళ్లే శ్రీ సాయి బాలాజీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏలూరు జాతీయ రహదారి పై డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 19 మంది గాయపడ్డారు. వెంటనే హైవే మొబైల్ టీం పోలీసులు 108 వాహనాల్లో క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరికొంతమందిని ఆశ్రమ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రసాద్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులంతా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. బస్సు స్టీరింగ్ ఆకస్మికంగా పట్టేయడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.