వైసీపీ ఓటమికి కారణం ఏంటి..?
175 గ్యారెంటీ అని ఆశపడితే కేవలం 11 సీట్లే ఎందుకొచ్చాయి..?
ఎవరి లెక్కలు ఎలా ఉన్నా.. ఆ పార్టీ అధినేత సహా మరికొందరు కీలక నేతలు నెపం ఈవీఎంలపైకి నెట్టేశారు. కానీ అప్పుడప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లాంటివారు మాత్రం అసలు నిజాలు ఒప్పుకుంటున్నారు. తాజాగా అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలో ఉండగా కార్యకర్తల్ని పట్టించుకోలేదని కుండబద్దలు కొట్టారు. కార్యకర్తల్ని పట్టించుకోకపోయినా వారు జగన్ ని గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఆ అభిమానంతోనే ఆయన్ను మళ్లీ గెలిపించుకుంటారని, ఈసారి గెలిచాక కార్యకర్తలకు న్యాయం చేస్తామని వివరించారు అనిల్. గతంలో జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసినా పార్టీ ఓటమికి ఇది కారణం అని మాత్రం ఒప్పుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయామని, ఇకపై జగన్ 2 పాయింట్ ఓ ని చూస్తారని, అప్పుడు కార్యకర్తలకు తగిన న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు జగన్. ఆయన మాటల్ని ఎంతమంది విశ్వసిస్తారో తెలియదు కానీ, కార్యకర్తలకు మాత్రం ఆయన భరోసా ఇవ్వాలని చూశారు.
పోరాటాలు కొత్త కాదు..
వైసీపీకి పోరాటాలు కొత్తేమీ కాదన్నారు అనిల్. పార్టీ పెట్టిన తర్వాత కష్టాలు పడి పోరాటాలు చేసి పదేళ్లకు అధికారంలోకి వచ్చామని చెప్పారాయన. ఇప్పుడు మళ్లీ ప్రతిపక్షంలోకి వచ్చామని ఈసారి కూడా పోరాటాలు తప్పడం లేదన్నారు. కేసులు పెడుతున్నా ఎక్కడా వెనకడుగు వేయకుండా పోరాడుతున్న కార్యకర్తలను తాము కూడా గుండెల్లో పెట్టుకుంటామని అన్నారు. వచ్చేసారి కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, కొందరు ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ, మట్టి మాఫియాకు పాల్పడుతున్నారని విమర్శించారు.
రాస్కోండి.. చూస్కుందాం..
టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైసీపీ నేతల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతోందని విమర్శించారు అనిల్. తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారాయన. కేసులను ఎదుర్కొంటున్న వైసీపీ కార్యకర్తలంతా ఒక పుస్తకం పెట్టుకోవాలన్నారు. టీడీపీ తప్పులన్నీ అందులో రాసుకోవాలన్నారు. ఏయే నాయకుడు ఏం చేశాడు, ఎలా ఇబ్బంది పెట్టాడనేది వివరంగా రాసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి ట్రీట్మెంట్ వారికి ఇస్తామని హెచ్చరించారు అనిల్. ఒక్కొక్కరి సంగతి చూస్తామని అన్నారాయన.
వీరుడు..
ఇక వైసీపీ పరాజయానికి పొత్తు రాజకీయాలు కూడా ఒక కారణం అని పరోక్షంగా ఒప్పుకున్నారు అనిల్. ఎవరితోనూ పొత్తు పెట్టుకోని జగన్ వీరుడిగా మిగిలిపోయారన్నారాయన. ఒక్కడిగా ఆయన పోరాటం చేశారని, పొత్తులతో మోసాలు చేసి కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. ఈసారి అది సాధ్యం కాదన్నారు. కూటమిపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఏడాదిలోనే ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అనిల్. నెల్లూరు జిల్లాలో ఏ ఒక్క స్థానంలోనూ వైసీపీ గెలవలేదు. ఓటమి తర్వాత అనిల్ కుమార్ యాదవ్ కూడా కొన్నిరోజులు నియోజకవర్గానికి మొహం చాటేశారు. ఇటీవల ఆయన తిరిగి యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గానికి అనిల్ దూరమయ్యారు. ఆయన్ను నరసరావుపేట నుంచి లోక్ సభకు పోటీ చేయించారు జగన్. ఈసారి మాత్రం అనిల్ తిరిగి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నారు.