చివరిసారిగా వల్లభనేని వంశీ కేసు విషయంలో బిగ్ టీవీతో మాట్లాడారు మాజీ మంత్రి కొడాలి నాని. 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోనీయండి లాయర్లున్నారు కదా అని లాజిక్ తీశారు. అప్పట్లో ఫైర్ తో మాట్లాడిన నాని, చాలాకాలం తర్వాత పూర్తిగా సైలెంట్ గా నియోజకవర్గంలోకి వచ్చారు. ఈసారి మాత్రం ఆయన కూల్ గా కనిపించారు. అప్పటి వాడి, వేడి ఏమాత్రం కనపడలేదు.
గుడివాడ కోర్టుకి నాని..
కొడాలి నానికి ఇటీవల ముంబైలో గుండె ఆపరేషన్ జరిగింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆయన మొదట హైదరాబాద్ ఆస్పత్రిలో చేరారు. ఆతర్వాత అటునుంచి అటే ముంబై వెళ్లారు. అక్కడ సర్జరీ జరిగిన తర్వాత కూడా చాలారోజులు అక్కడే ఉండిపోయారు. ఆంధ్రప్రదేశ్ కి వస్తే ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న వార్తలు కూడా వినిపించాయి. ఆ భయంతోనే ఆయన ఏపీకి దూరంగా ఉన్నారని అన్నారు. ఆయన విదేశాలకు వెళ్లకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ ఆయ్యాయి. ఇటీవల ఆయన వేరే దేశానికి వెళ్లబోతుంటే పోలీసులు పట్టుకున్నారనే పుకార్లు షికార్లు చేశాయి. ఆ సమయంలో కూడా ఆయన వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా ఆయన గుడివాడలో కనిపించారు. ఓ కేసులో బెయిల్ దరఖాస్తులను సమర్పించేందుకు కోర్టు వద్దకు వచ్చారు నాని.
కార్యకర్తలతో కొడాలి నాని. pic.twitter.com/TLiCboJCHx
— Sakshi TV (@SakshiHDTV) June 27, 2025
మీడియాకు దూరంగా..
అనారోగ్యంతో ఉన్న ఆయన గుండె దగ్గర పట్టీ వేసుకుని కనిపించారు. మీడియాతో కూడా మాట్లాడకుండానే కారెక్కి వెళ్లిపోయారు. వాస్తవానికి కొడాలి నాని బయటకు వస్తున్నారంటే ముందుగానే మీడియాకు సమాచారం ఉంటుంది. కానీ ఇక్కడ సమాచారం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. మైకులు ఉంటే కచ్చితంగా కొడాలి నాని ఎవర్నీ నిరుత్సాహపరచరు. దూరంగా వెళ్లిపోరు. కానీ ఈసారి మాత్రం ఆయన కేవలం అభిమానులతో కరచాలనం చేసి కారెక్కి వెళ్లిపోయారు. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన యాక్టివ్ గా పాల్గొనడేలేదు. పార్టీ పిలుపునిచ్చిన నిరసనలకు హాజరు కావడం లేదు. తాడేపల్లిలో జగన్ అధ్యక్షతన జరిగే మీటింగులకు కూడా కొడాలి హాజరైన దాఖలాలు లేవు.
ఎంత తేడా..?
అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని బూతులతో రెచ్చిపోయేవారనే విమర్శలున్నాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్.. ఏ ఒక్కర్నీ ఆయన వదిలిపెట్టేవారు కాదు. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడేవారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయనలో ఫైర్ తగ్గలేదు. వల్లభనేని వంశీ అరెస్ట్ సమయంలో కూడా కొడాలి గాంభీర్యం ఏమాత్రం తగ్గలేదు. రెడ్ బుక్, బ్లూ బుక్ కి భయపడేది లేదన్నారు. కేసులు పెట్టినా తగ్గేది లేదన్నారు, తమ వైపు లాయర్లున్నారని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆ ధీమా ఇప్పుడు కనపడ్డంలేదు. టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు బట్టల షాపుపై దాడి ఘటనలో కొడాలి నాని తాజాగా ముందస్తు బెయిల్ పొందారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. కిందికోర్టులో బెయిల్ తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కొడాలి నాని గుడివాడ కోర్టులో ష్యూరిటీ పత్రాలు సమర్పించి బెయిల్ పొందారు.