జులై 1 (July 1) నుంచి రైల్వేలో భారీ మార్పులు చూడనున్నారు. టికెట్ (Train Ticket Rates) ధరలే కాకుండా కొన్ని రూల్స్ కూడా అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా తాత్కాల్ టికెట్ (Tatkal Ticket), వెయిటింగ్ లిస్ట్ (Waiting List Tickets) వంటి అంశాలపై రైల్వే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. లేకపోతే సమస్యల్లో చిక్కుకుంటారు. మరి, జులై నుంచి రైల్వేలో రానున్న మార్పులేంటీ?
1. పెరగనున్న టికెట్ ధరలు
జులై 1వ తేదీ నుంచి రైల్వే టికెట్ ధరల్లో మార్పులు రానున్నాయి. నాన్-ఏసీ మెయిల్ రైళ్లు, ఎక్స్ ప్రెస్ రైళ్ల టికెట్ ధర ప్రతి కిలోమీటరుకు 1 పైసా చొప్పున పెరగనుంది. ఏసీ క్లాస్ రైళ్లకు ప్రతి కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెంచుతారు. అయితే జనరల్ క్లాస్‌కు మాత్రం కాస్త ఉపసమనం లభించనుంది. ముఖ్యంగా 500 కి.మీల లోపు ప్రయాణం చేసేవారికి ఎలాంటి వడ్డింపులు ఉండవు. పాత ధరలే కొనసాగుతాయి. 500 కిమీలు కంటే ఎక్కువ ప్రయాణిస్తే మాత్రం.. కిలోమీటరుకు 1 పైసా చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కొత్త ధరలు కేవలం సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లకు మాత్రమే వర్తిస్తాయి. ఎంఎంటీస్ లేదా సబర్బన్ రైలు, సీజనల్ టికెట్లకు వర్తించదు. అయితే, దీనిపై రైల్వే పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన వెల్లడించాల్సి ఉంది. తాజా పెంపుపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వం మాత్రం గత 12 ఏళ్లలో రైళ్ల ధరలను పెంచడం ఇదే మొదటిసారి అని, అది కూడా చాలా స్వల్పంగా పెంచుతున్నామని తెలుపుతోంది. సామాన్యులపై ఎలాంటి భారం మోపడం లేదని స్పష్టం చేసింది.
2. మారనున్న తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనలు
ఆన్‌లైన్‌లో తత్కాల్ టికెట్లు బుక్ చెయ్యడం ఎంత కష్టమో తెలిసిందే. ఓపెన్ చేసిన ఒక్క నిమిషంలోనే టికెట్లన్నీ అయిపోతాయి. ఇందుకు కారణం ఏజెంట్లు, నకిలీ ఖాతాలే అనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇకపై తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. కాబట్టి ఇకపై IRCTC లేదా SwaRail యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి. మీ ఖాతాకు ఆధార్ కార్డును లింక్ చెయ్యాలి. లేకపోతే టికెట్ బుక్ చెయ్యలేరు.
అంతేకాదు.. జులై 15 నుంచి ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS), అధీకృత ఏజెంట్లు, ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసే అన్ని తత్కాల్ టికెట్లకు కూడా ఆధార్ ఆధారిత
OTP ధృవీకరణ తప్పనిసరి.
Also Read: గుడ్ న్యూస్.. ఇక ఈ కారణాలకు కూడా రైలు టికెట్‌పై ఫుల్ రిఫండ్
3. ఇక ఏజెంట్ల ఆటలు సాగవు
ఇకపై ఏజెంట్లు తత్కాల్ టికెట్లను అంత ఈజీగా బుక్ చెయ్యలేరు. ఎందుకంటే.. తత్కాల్ బుకింగ్ విండో మొదటి 30 నిమిషాల్లో (ఏసీ తరగతులకు ఉదయం 10:00–10:30, నాన్-ఏసీ తరగతులకు ఉదయం 11:00–11:30) అధీకృత ఏజెంట్లు టికెట్లు బుక్ చేయడాన్ని రైల్వే నిషేదించింది. దీనివల్ల బాట్, ఏజెంట్లు, బల్క్ బుకింగ్స్ తగ్గుతాయి. సామాన్య ప్రయాణికులకు సులభంగా టికెట్లు దొరుకుతాయి. నకిలీ ఖాతాలకు కూడా అడ్డుకట్ట పడుతుంది.