తక్కువ ఛార్జీతో పుణ్యక్షేత్రాలు, పర్యటక ప్రాంతాలను చూసే టూరిస్టుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎప్పటికప్పుడు సరికొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే తాజాగా భారత్ గౌరవ్ కాశీ దర్శనం పేరుతో కొత్త ప్యాకేజీని ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం, IRCTCతో కలిసి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ‘కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ దర్శనం’ థీమ్ తో తీర్థయాత్ర పర్యటనను అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా, యాత్రికులు నాలుగు ప్రముఖ పవిత్ర స్థలాలను సందర్శిస్తారు. వారణాసి, గయ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ ను దర్శించుకుంటారు. మొత్తం ప్రయాణం 9 రోజులు కొనసాగే ఈ యాత్ర అక్టోబర్ 5 ప్రారంభం కానుంది.
⦿ వారణాసి: తులసి మానస్ ఆలయం, సంకట్ మోచన్ హనుమాన్ ఆలయం, కాశీ విశ్వనాథ ఆలయం, గంగా హారతి దర్శనం ఉంటుంది.
⦿ అయోధ్య: రామ జన్మభూమి ఆలయ సందర్శనం ఉంటుంది.
⦿ గయ: విష్ణుపాద ఆలయం, మహాబోధి ఆలయం దర్శించుకోవచ్చు.
⦿ ప్రయాగ రాజ్: హనుమాన్ ఆలయం, గంగానదిలో పవిత్ర స్నానం చేయవచ్చు.
IRCTC టూరిజం ప్రకారం.. పవిత్ర స్నానం, గంగా హారతి నీటి స్థాయి ఆధారంగా సాధ్యాసాధ్యాలకు లోబడి ఉంటాయి.
భారత్ గౌరవ్ కాశీ దర్శనం యాత్ర యశ్వంత్ పూర్ స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. యాత్రికులు తుమకూరు, బిరూర్, దావణగెరె, హవేరి, హుబ్బళ్లి, బెల్గాంలలో రైలు ఎక్కడానికి అనుమతి ఉంటుంది.
భారత్ గౌరవ్ కాశీ దర్శనం ప్రయాణం 8 రాత్రులు, 9 పగళ్లు కొనసాగుతుంది. ఈ పర్యటనకు ఒక్కొక్కరికి రూ. 22,500 ఛార్జ్ చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం రూ. 7,500 ప్రత్యేక సబ్సిడీని అందిస్తోంది.
⦿ కాశీ దర్శనం కోసం వెళ్లే యాత్రికులకు భారత్ గౌరవ్ ప్రత్యేక రైలులో 3AC తరగతిలో ప్రయాణ అవకాశం ఉంటుంది.
⦿ నాన్ ఏసీ హోటళ్లలో ట్విన్/ట్రిపుల్ షేర్ లో రాత్రి బసలు అందించబడతాయి.
⦿ అన్ని భోజనాలు (వెజ్ మాత్రమే) ఉచితంగా అందిస్తారు.
⦿ నాన్ ఏసీ బస్సులలో దర్శనాలు, రవాణా సౌకర్యం ఉంటుంది.
⦿ ప్రయాణీకులకు ప్రయాణ బీమా కల్పిస్తారు.
Read Also: అమెరికా షట్ డౌన్, విమానాలు, వీసాలపై ఎఫెక్ట్ ఉంటుందా?
బోటింగ్, అడ్వెంచర్ గేమ్స్, నిర్ణయించిన ఫుడ్ కాకుండా ఇతర ఫుడ్స్ కు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సందర్శనా స్థలాల ఖర్చులు, ఎంట్రీ ఫీజులు, స్థానిక గైడ్ సేవలకు అదనంగా ఛార్జ్ చేస్తారు. మెనూలలో లేని లాండ్రీ ఖర్చులు, వైన్లు, మినరల్ వాటర్, ఆహారం, పానీయాలు లాంటివి యాత్రికులే భరించాల్సి ఉంటుంది.
Read Also: డ్రోన్ సాయంతో రైలు మొత్తాన్ని కడిగేశారు.. జస్ట్ అరగంటలోనే!