Tandoor Crime: వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని తాండూరు రైల్వే స్టేషన్ లో ఓ పోలీస్ అధికారి రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ జారి పడి మృతిచెందారు. మృతిచెందిన పోలీస్ అధికారిని కర్నాటక రాష్ట్రం చించోలి తాలుకా మార్పల్లికి చెందిన మారుతి (49) గా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కాలు జారడంతో ప్రమాదం..
ఘటనకు సంబంధించిన వివరాలను వికారాబాద్ రైల్వే ఎస్ హెచ్‌వో హరి ప్రసాద్ తెలిపారు. కాలబురిగి జిల్లా జేడీ హల్లి పీఎస్ లో మారుతి ఏఎసై గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే మంగళ వారం రాత్రి డ్యూటికి వెళ్లేందుకు తాండూరు రైల్వే స్టేషన్ కు వెళ్లారు. దాదాపు రాత్రి 11 గంటల సమయంలో యశ్వంత పూర్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కేందుకు ఏఎస్సై మారుతి ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కాలు జారి రైలు కింద పడిపోయాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి..
ఘటనలో రెండు కాళ్లు విరిగిపోవడంతో మారుతి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రమాద ఘటనను గమనించిన రైల్వే సిబ్బంది శ్రీను, నదీమ్ వెంటనే బాధితుడ్ని తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోస కుటుంబ సభ్యులు కాలబురిగిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మారుతి పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రైలు ఎక్కేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
రైలు ఎక్కేటప్పుడు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. రైలు పూర్తిగా ఆగిన తర్వాత మాత్రమే ఎక్కడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. రైలు రన్నింగ్ లో ఉన్నప్పుడు ఎక్కడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. పిల్లలను, వృద్ధులను, వైకల్యాలున్న వారిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. వారికి రైలు ఎక్కడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి.. పక్కన ఉండి సహాయం చేయాలని చెబుతున్నారు.
⦿ రైలు పూర్తిగా ఆగిన తర్వాత మాత్రమే ఎక్కడానికి ప్రయత్నించాలి..
⦿ రైలు కదిలేటప్పుడు ఎక్కడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదకరం.
⦿ పిల్లలను, వృద్ధులను, వైకల్యాలున్న వారిని జాగ్రత్తగా చూసుకుని, వారికి సహాయం చేయాలి.
⦿ రైలు ఎక్కేటప్పుడు అజ్రాగత్తగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.. కాబట్టి జాగ్రత్తగా ఉండండి..