ప్రభుత్వ పాఠశాలల్లో విద్య మాత్రమే కాదు, విద్యను బోధించే ఉపాధ్యాయుల పరిస్థితీ అత్యంత దారుణంగా ఉంది. సబ్జెక్ట్ మీద కనీస అవగాహన లేని వాళ్లు ఎంతో మంది టీచర్లుగా కొనసాగుతున్నారు. నార్త్ స్టేట్స్ లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించిన ఉన్నతాధికారులు ఇలాంటి టీచర్లు కూడా ఉన్నారా? అని ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక ప్రభుత్వ పాఠశాల జారీ చేసిన చెక్కును బ్యాంకు అధికారులు తప్పులు ఉన్నాయని రిజెక్ట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చెక్ విద్యా వ్యవస్థలో ప్రమాణాల గురించి ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
ఈ చెక్కును అట్టర్ సింగ్ అనే వ్యక్తి కోసం తయారు చేశారు. హిమాచల్ ప్రదేశ్ రోన్ హాట్ లోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ రూ.7,616 అమౌంట్ కు చెక్ ఇష్యూ చేశారు. ఈ డబ్బును పదాల్లో రాసే సమయంలో అన్ని సుద్ద తప్పులు ఉన్నాయి. ఏడు అనే పదాన్ని సావెన్ అని, వెయ్యి స్థానంలో గురువారం అని, వందను హరేంద్రగా, పదహారు అనే దానికి బదులుగా అరవై అని రాశారు. అయితే, నెంబర్స్ లో మాత్రం కరెక్ట్ గా రాశారు. ఈ చెక్ లో ప్రిన్సిపాల్ సంతకం, స్టాంప్ ఉన్నప్పటికీ, ప్రిన్సిపాల్ స్వయంగా ఆ మొత్తాన్ని పదాలలో రాశారా? లేదా? అనేది ఇంకా తెలియదు. చెక్ ను బ్యాంక్ అధికారులు రిజెక్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.
₹7,616 ..…“ सेवन थर्सडे सिक्स हरेन्द्र सिक्सटी रूपीस ओनली ”
📍 सिरमौर के रोनहाट स्थित सरकारी वरिष्ठ माध्यमिक विद्यालय के प्रधानाचार्य द्वारा जारी ₹7,616 का चेक सुर्खियों में है।
▪️ रकम से ज़्यादा यह चेक अपने शब्दों की वजह से वायरल हो गया है pic.twitter.com/Uhmz7mojDy
— The Modern Himachal (@I_love_himachal) September 29, 2025
ఇక ఈ చెక్ కు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలతో పాటు అసలు ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీదే నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు. “ఇవీ ప్రభుత్వ పాఠశాలల్లో మన ఉపాధ్యాయులకు ఉన్న విద్యా ప్రమాణాలు” అంటూ మండిపతున్నారు. “ఐన్‌స్టీన్ అమెరికాను కనుగొన్నారని, న్యూటన్ విద్యుత్తును కనుగొన్నారని విద్యార్థులు ఎందుకు అంటారో ఇప్పుడు అర్థం అయ్యింది” అని మరో వ్యక్తి ఫన్నీగా కామెంట్ చేశారు. “రిజర్వేషన్ హటావో, దేశ్ బచావో (రిజర్వేషన్లను తొలగించండి, దేశాన్ని రక్షించండి)” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ఈ సంఘటనను విద్యా వ్యవస్థలో నియామకాలపై విస్తృత చర్చకు కారణం అయ్యింది. కొంత మంది నెటిజన్లు రిజర్వేషన్ వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేసే వరకు వెళ్లారు. నియామకాలు మెరిట్ ఆధారితంగా ఉండాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రిన్సిపాల్స్ లాంటి పదవులకు మెరిట్ ను ప్రాతిపదికగా తీసుకోవాలంటున్నారు. మొత్తంగా ఈ చెక్ వ్యవహారం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.