“మానసికంగా ఆరోజే చచ్చిపోయా.. నా పరిస్థితి ఎవరికీ రావొద్దు” అంటూ ఆమధ్య ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని, మరోసారి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు, అభిమానులతో అత్యవసర మీటింగ్ పెట్టారు. తనను అరెస్ట్ చేస్తే జరిగే పరిణామాలపై ఆయన కార్యకర్తలతో మాట్లాడినట్టు తెలుస్తోంది. తన వారసుడిగా కొడుకు పేర్ని కిట్టుని ఆయన ఆల్రడీ తెరపైకి తెచ్చారు. తనకు జైలు ఖాయమైతే పేర్ని కిట్టు ఆధ్వర్యంలో కేడర్ పనిచేయాలని సూచించారు. పార్టీ పిలుపునిచ్చే ఏ కార్యక్రమాన్నయినా విజయవంతం చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద పేర్ని నాని ఎమర్జెన్సీ మీటింగ్.. ఏపీ రాజకీయాల్లో మరో అరెస్ట్ ఖాయమనే వార్తను ధృవీకరిస్తోంది.
సాక్షి కవరింగ్ గేమ్..
పేర్ని నాని అరెస్ట్ ఖాయమని, ఆయనకు వారెంట్ కూడా జారీ అయిందని ఓవైపు వార్తలు వినిపిస్తున్నా, వైసీపీ మీడియా మాత్రం అది కేవలం కోర్టు నోటీసు మాత్రమేనని పేర్కొనడం గమనార్హం. ఓ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారని.. విచారణకు రావాలని ఆయనకు కోర్టు నోటీసిచ్చిందని, దానికి ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తోందంటూ సాక్షిలో వార్తలొచ్చాయి. కానీ పేర్ని నాని మాత్రం ఆందోళనగా కనపడటం, అత్యవసర మీటింగ్ లు పెట్టుకోవడం ఇక్కడ గమనార్హం.
అసలు కేసేంటి..?
ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని నిల్వచేసే గోడౌన్ల విషయంలో అవతవకలకు పాల్పడ్డారని పేర్ని నాని, అతని భార్యపై అభియోగాలున్నాయి. ఆ గోడౌన్లు పేర్ని నాని భార్య పేరుమీద ఉండటంతో, ఆమె పేరు ఈ కేసులో చేర్చాల్సి వచ్చింది. ఆమధ్య కోటి రూపాయలు ప్రభుత్వానికి పేర్ని నాని జరిమానా కూడా చెల్లించారు. చేయని తప్పుకి కోటి రూపాయలు ఎవరైనా జరిమానా కడతారా..? తప్పు జరిగింది కాబట్టే ఆయన కోటి రూపాయలు కట్టి తప్పించుకోవాలనుకున్నారనే వార్తలొచ్చాయి. అయితే తాను ఒక వ్యక్తిని నమ్మి మోసపోయానని, అతడి వల్లే ఈ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చిందని అంటున్నారు నాని. అంతే కాదు, ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. పౌర సరఫరాల శాఖ చరిత్రలో ఎవరి మీద కూడా క్రిమినల్ కేసులు లేవని, కేవలం తనపైనే క్రిమినల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారాయన. తన పరిస్థితి పగ వాడికి కూడా రాకూడదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోజే పేర్ని నాని అరెస్ట్ ఖాయమని అనుకున్నారంతా.
ఆ ప్రెస్ మీట్ జరిగిన కొన్ని రోజులకే పేర్ని నానికి అరెస్ట్ వారంట్ అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు కోర్టు అరెస్ట్ వారంట్ ఇష్యూ చేసిందని అంటున్నారు, కానీ సాక్షి మాత్రం ఓ కేసులో కోర్టుకు హాజరు కావాలని మాత్రమే ఆదేశాలు అందాయని అంటోంది. ఈ వార్తల్లో నిజమెంత అనే విషయం పక్కనపెడితే.. మాజీ మంత్రి ముందు జాగ్రత్తగా కేడర్ తో సమావేశమయ్యారు. తాను అరెస్ట్ అయినా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలేవీ ఆగకూడదని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే పేర్ని అరెస్ట్ ఎప్పుడనేది ఇంకా తెలియరాలేదు. ఈలోగా ఆయన అలర్ట్ కావడంతో నేడో రేపో, పేర్నిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఖాయమని తేలిపోయింది.