Roja Comments: ఆమె ఒక మాజీ మంత్రి. వైసీపీలో కీలక మహిళ నేతగా వ్యవహరించారు. ఫైర్ బ్రాండ్ అంటూ పేరుగాంచారు కూడా ఈ నేత. ఎన్నికల ముందు వరకు ఈమె నోట విమర్శలు వచ్చాయంటే చాలు, పొలిటికల్ బాంబులు విసిరినట్లేనని చెప్పవచ్చు. ఎన్నికల అనంతరం సైలెంట్ గా ఉన్న ఈ మహిళా నేత ఒక్కసారిగా సీరియస్ కామెంట్స్ చేశారు. ఇంతకు ఆ మహిళా నేత ఎవరో కాదు మాజీ మంత్రి రోజా.
ఏపీ మాజీ మంత్రి రోజా నగరి నియోజకవర్గ నుండి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రోజా, కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత ఓటమి నుండి కోలుకొని, మాజీ సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా తన ఓటమికి సంబంధించిన అంశాలపై జగన్ తో ఆమె చర్చించారు. తన ఓటమికి కారకులుగా స్థానిక వైసీపీ నాయకులేనంటూ, రోజా అధిష్టానం వద్ద ఏకరువు పెట్టినట్లు సమాచారం. తాజాగా నగరి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు రోజా ముందడుగు వేశారు.
తాజాగా నగరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన రోజా సంచలన కామెంట్స్ చేశారు. రోజా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలను గుర్తించి అధికారంలోకి వచ్చిందని, మాజీ సీఎం జగన్ ఉన్నది ఉన్నట్లు చెప్పి అధికారాన్ని కోల్పోయారన్నారు. కూటమి అధికారంలోకి రావడంతోటే ప్రజా సంక్షేమాన్ని మరచి, వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని రోజా విమర్శించారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయించి కూటమి ప్రభుత్వం ఇబ్బందులు గురిచేస్తుందని ఆమె తెలిపారు.
కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ కార్యకర్తలకు మాజీ సీఎం జగన్ అండగా ఉంటారని రోజా అన్నారు. వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని తప్పు చేయని మనం ఎందుకు భయపడాలంటూ రోజా ప్రశ్నించారు. నగరి నియోజకవర్గ వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు అండగా తాను ఉంటానని, పోరాటాలు చేయటం తనకేమీ కొత్త కాదంటూ కార్యకర్తలు ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.
Also Read: AP Govt: ఏపీలో సూపర్ స్కీమ్.. అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోండి!
అంతేకాకుండా కేసులు పెడితే పెట్టుకోండి. జైల్లో వేసుకుంటే వేసుకోండి. రాబోయేది జగనన్న ప్రభుత్వమే, అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తానంటూ సంచలన కామెంట్స్ చేశారు రోజా. రోజా చేసిన ఈ కామెంట్స్ కి వైసీపీ కార్యకర్తలు అచ్చం వ్యక్తం చేస్తూ చప్పట్ల మోత మోగించారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం బదులు, కేసులు పెడతానంటూ సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కి తేరలైపోయారని రోజా ఘాటుగా వ్యాఖ్యానించారు. నగరి నియోజకవర్గ వైసీపీ సమావేశంలో రోజా చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ కామెంట్స్ కి టీడీపీ ఏ విధంగా రిప్లై ఇస్తుందో వేచి చూడాలి.