నగరి పోలీసులపై మాజీ మంత్రి రోజా చిందులు తొక్కారు. అంత అర్జెంట్ గా మీరు ఇక్కడికెందుకొచ్చారంటూ ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్ట్ వచ్చేంత వరకు స్టేషన్లో ఉండి రావొచ్చు కదా అని అడిగారు. పుత్తూరు కోర్టు ముందు ఈ సంవాదం జరిగింది. పోలీసులు సమాధానం చెబుతున్నా రోజా దబాయించడం విశేషం.
అసలేం జరిగింది..?
నగరి నుంచి చెన్నైకి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారనే కేసులో ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరు పరచిన సందర్భంలో రోజా అక్కడికి చేరుకున్నారు. తమ కౌన్సిలర్లను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. ఎఫ్ఐఆర్ కూడా పెట్టకుండా కోర్టుకి ఎందుకు తీసుకొచ్చారన్నారు. కోర్టు ఎదుట పోలీసులతో రోజా సంవాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మావాళ్లు చేయగలరా..?
మూడు రోజుల క్రితం చెన్నైకి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు టిప్పర్ లారీలను పోలీసులు సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాతో సంబంధం ఉందంటూ ఇద్దరు నగరి వైసీపీ కౌన్సిలర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బిలాల్, బిడి భాస్కల్ అనే ఇద్దర్ని అదుపులోకి తీసుకుని కోర్టుకి తెచ్చారు. ఆ ఇద్దరి తరపున రోజా రంగంలోకి దిగారు. అసలు వైసీపీ కార్పొరేటర్లు ఇసుక అక్రమ రవాణా చేయగలరా అని ప్రశ్నిస్తున్నారామె. ప్రభుత్వం తమది కాదు, పోలీసులు, రెవెన్యూ తమకి సపోర్ట్ చేయవు, అయినా కూడా తమవారు అక్రమంగా ఇసుక రవాణా చేశారంటే ఎలా నమ్ముతారని అడిగారు. వారిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఇసుక అక్రమ రవాణా గురించి ఫిర్యాదులు చేస్తున్నారని, అందుకే వారిద్దర్నీ అక్రమంగా కేసులో ఇరికించారని ఆరోపించారు రోజా. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ల పై కేసులు పెట్టొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా ఏపీ పోలీసులు పట్టించుకోవడం లేదన్నారామె.
నగరి ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు..
నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి రోజా. తల్లికి గౌరవం ఇవ్వని వాడు నగిరి ఎమ్మెల్యే అని అన్నారు. గాలిలో గెలిచిన వాడు, గాలివాడు నగరి ఎమ్మెల్యే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు ఎలా పెట్టాలో ఏపీలో స్టడీ చేయొచ్చని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదని అక్రమ ఇసుక రవాణాతో ఎమ్మెల్యేకు సంబంధాలున్నాయని చెప్పారు. రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరి వరకు వచ్చి తమిళనాడుకు టిప్పర్ లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పారు రోజా. ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని తెలిసినా ఏడాదిగా పోలీసులు, మైనింగ్ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రకశ్నించారు.
భానుప్రకాష్ సవాల్..
మాజీ మంత్రి రోజా కు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సవాల్ విసిరారు. రోజాకు ధైర్యం ఉంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలన్నారు. టైం ఆమె చెప్పినా సరే తనను చెప్పమన్నా సరే అన్నారు. గత ఐదేళ్ళుగా ఇసుక, బియ్యం అక్రమ రవాణాలో రోజా, అమె అన్నదమ్ములకు, అమె అనుచరులకు సంబంధం ఉందని, ఆమెకు ధైర్యం ఉంటే.. లేదని చెప్పి కాణిపాకంలో ప్రమాణం చేయాలన్నారు. రోజా వ్యవహారం చూస్తుంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉందన్నారు. వైసీపీ నేతలు ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే తామే పట్టించామన్నారు. అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే భానుప్రకాష్.