Vallabhaneni Vamsi: ఏపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల్లో వస్తున్న సమాచారం ప్రకారం.. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు.. గత కొద్ది రోజులుగా ఆయన కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ అమెరికాకు పారిపోయారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా వల్లభనేని వంశీని గన్నవరంలోని ఆయన నివాసంలోనే పోలీసులు అరెస్ట్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ చేసిన అనంతరం ఆయనను గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరిలించినట్లు అందులో పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న సమయంలో వల్లభనేని వంశీ కారును వెంబడించిన పోలీసులు ఆయన ఇంటికి సమీపంలోకి రాగానే అరెస్ట్ చేశారంటూ అందులో రాసుకొచ్చారు. ఇక టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా,వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసుఫ్ పఠాన్ హైదరాబాద్ లో ఉన్నట్లు తెలియడంతో రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు అందులో చెప్పారు.
Also Read: శ్రీశైలంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి.. భక్తులు గుర్తుపట్టి..
ఇదిలా ఉంటే.. గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు 71వ నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిందని చెబుతున్నారు.