ముంబైలో ఆసక్తికర ఘటన జరిగింది. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారమ్ మీద ఓ గర్భిణీకి యువకుడు ప్రసవం చేశాడు. మహిళా డాక్టర్ ఫోన్ కాల్ లో ఇస్తున్న సలహా ప్రకారం అతడు ఆమెకు డెలివరీ చేశాడు. ఈ ఘటన రామ్ మందిర్ రైల్వే స్టేషన్ లో ఇవాళ తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రయాణీకులు, మహిళా కుటుంబ సభ్యులు ఆ యువకుడు చూపిన ధైర్యానికి అభినందలు కురిపించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఓ మహిళ తన కుటుంబంతో ప్రయాణిస్తుండగా ఆమెకు ప్రసవ నొప్పి వచ్చింది. ఆమె బంధువులు ముందుగా ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, సిబ్బంది ప్రసవం చేయడానికి నిరాకరించారు. సహాయం కోసం వారు తిరిగి రైల్వే స్టేషన్ కు వచ్చారు. రైలు ఎక్కారు. ప్రయాణ సమయంలో ఆమెను నొప్పులు రావడం మొదలయ్యాయి. రామ్ మందిర్ స్టేషన్ కు రాగానే ఓ ప్రయాణీకుడు ఆమె పరిస్థితిని గమనించి వెంటనే రైలు గొలుసును లాగాడు. అంబులెన్స్, డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఓ యువకుడు, రైల్లోని మరికొంత మంది సాయం కోసం ఎదరు చూశాడు.
చాలా మంది వైద్యులను పిలవడానికి ప్రయత్నించారు. కానీ, అంబులెన్స్ స్టేషన్ చేరుకోవడానికి సమయం పట్టింది. ఈ లోగా, ఓ యువకుడు మహిళా డాక్టర్ కు వీడియో కాల్ చేశాడు. ఆమె చెప్పే విధానం ప్రకారం సదరు మహిళ సురక్షితంగా ప్రసవించేలా తగిన చర్యలు చేపట్టాడు. ఆమె సూచనల ప్రకారం.. గర్భిణీ బిడ్డను ప్రసవించింది. తల్లి, శిశువు క్షేమంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రసవం తర్వాత, ప్రయాణీకులు, రైల్వే సిబ్బంది సహాయంతో తల్లి, బిడ్డను సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: ఇది ప్రపంచంలోనే మోస్ట్ లాంగెస్ట్ ట్రైన్ జర్నీ, ఏకంగా 13 దేశాలను చుట్టేస్తుంది!
ఈ ప్రసవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. సదరు యువకుడు మహిళకు ప్రసవం చేయడం పట్ల ప్రయాణీకులతో పాటు సోషల్ మీడియా వినియోగదారులు ఆ వ్యక్తి ధైర్యసాహసాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడిని రియల్ లైఫ్ హీరో అంటూ కొనియాడుతున్నారు. “దేవుడు ఈ సోదరుడిని అక్కడికి ఒక కారణం కోసం పంపినట్లు అనిపించింది. అతడు రాత్రి సమయంలో రెండు ప్రాణాలను కాపాడాడు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దేశం అంతటా ఆ యువకుడి మానవత్వం, ధైర్యాన్ని ప్రశంసించారు. ఒక వినియోగదారుడు “దేవుడు మీకు దీర్ఘాయుష్షును ప్రసాదించుగాక” అని వ్యాఖ్యానించారు. “ఈ వ్యక్తిని ప్రభుత్వం కచ్చితంగా గౌరవించాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం సదరు యువకుడిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: టికెట్ లేని ప్రయాణాలపై రైల్వే ఉక్కుపాదం, ఒకే రోజు జరిమానా కింది ఎన్ని కోట్లు వసూళు చేసిందంటే?