Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భద్రతా లోపం వ్యవహారం సంచలనంగా మారుతోంది. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన సూర్య ప్రకాష్.. ఐపీఎస్ అధికారిగా పవన్ పర్యటనలో హడావిడి చేశారు. సూర్య ప్రకాష్ ను ఐపీఎస్ అధికారి అనుకుని.. కిందిస్థాయి పోలీసులు సైతం ఫోటోలు, వీడియోలు దిగడం చర్చనీయాంశం అవుతోంది.
ఈ క్రమంలోనే నకిలీ ఐపీఎస్ అధికారి సూర్యప్రకాష్ బాగోతం బయటపడుతోంది. గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేశానని ఆయన చెబుతున్నట్టు సమాచారం. గతంలో విజయనగరంలో తూనికలు కొలతలు ఉన్నతాధికారిగా హల్చల్ చేసి వ్యాపారస్తులను సూర్యప్రకాష్ భయపెట్టినట్టు వాపోతున్నారు. ఢిల్లీ, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులతో.. ఫోటోలు దిగి ఐపీఎస్ అధికారిగా ట్రైనింగ్ అవుతున్నానని స్నేహితులకు ఫోటోలు పంపినట్టు తెలుస్తోంది.
చీపురుపల్లి డీఎస్పీని కూడా ట్రైన్ ఐపీఎస్ అధికారి హోదాలో సూర్య ప్రకాష్ కలిసినట్టు చెబుతున్నారు. పోలీసులకు ఎక్కడా అనుమానం రాకుండా డ్రస్ కోడ్ నుంచి వాకింగ్ వరకు జాగ్రత్తలు తీసుకున్నట్టు వెల్లడవుతోంది. సూర్య ప్రకాష్ ఉదంతంతో పవన్ కళ్యాణ్ భద్రత పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో విచారణకు ఆదేశించారు హోం మంత్రి వంగలపూడి అనిత.
Also Read: తెలంగాణ లీడర్ల సిఫార్సు లేఖలపై షాక్ ఇచ్చిన టీటీడీ
ఇదిలా ఉంటే.. గాలివీడు ఎంపిడీవో జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఎంపీడీవోపై దాడి చేయడం బాధకరమని.. ఎంపిపి తనయుడు వచ్చి తాళాలు అడిగితే ఇవ్వనందుకు దాడి చేశారని అన్నారు. మండలం అభివృద్ది చేసే వ్యక్తిపై ఎంత ధైర్యం ఉంటే దాడి చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు ఇంకా అహంకారం చావలేదని.. అహంకారంతోనే ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తున్నారన్నారు. సుదర్శన్ రెడ్డి గతంలో శేఖర్ నాయక్, ప్రతాప్, శ్రీనివాస రెడ్డిపై కూడా దాడి చేశారని పవన్ వ్యాఖ్యానించారు. ఇష్టారాజ్యంగా చేస్తే తమ ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. అహంకారం తీస్తాం.. తోలుతీసి కింద కూర్చోబెడతాం.. అధికారులపై దాడిచేస్తే తాట తీస్తాం అని పవన్ వార్నింగ్ ఇచ్చారు.