Murali Nayak: పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆపరేషన్ సింధూర్ అమరుడు మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం, పలువురు ప్రముఖుల నుండి విస్తృతమైన సాయం అందింది. ఆయన త్యాగాన్ని గుర్తించి, కుటుంబానికి ఆర్థిక, భౌతిక స్థాయిలలో మద్దతు లభిస్తోంది.
పహల్గామ్ దాడి అనంతరం మన దేశం, పాక్ మధ్య ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన విషయం తెల్సిందే. కేవలం ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మన దేశం దాడులు నిర్వహిస్తే, పాక్ మాత్రం కుటిలబుద్ధితో మన దేశ పౌరులపై దాడులకు తెగ పడింది. ఈ చర్యను అడ్డుకోవడంలో మన సైనికులు వీరోచిత పోరాటం చేశారు. ఈ పోరాటం లో ఏపీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ అనే అగ్నివీర్ ప్రాణాలు అర్పించారు. చివరి శ్వాస ఉన్నంత వరకు ఉగ్రమూకలపై తెగబడ్డారు. చివరికి ప్రాణాలు అర్పించి అమరుడయ్యారు.
దేశం అంటే ఎనలేని భక్తి
దేశమంటే మురళీ నాయక్ కు అమితమైన భక్తి. దేశం కోసం ప్రాణం పోయినా ఒకటే అనే నైజం నాయక్ దే. నాయక్ అమరుడైన అనంతరం అతని ఇన్ స్టా లో గల వీడియోలు చూసి, ఇది ఇండియన్ సత్తా అంటూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అలాంటి నాయక్ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఎందరో ముందుకు వచ్చారు.
ప్రభుత్వ పరంగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరుడైన మురళీ నాయక్ కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దీనితో పాటు, 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
వ్యక్తిగతంగా
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత నిధుల నుంచి రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన ఒక నెల జీతాన్ని మురళీ నాయక్ కుటుంబానికి విరాళంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మాజీ సీఎం జగన్ కూడా మురళీ నాయక్ కుటుంబాన్ని తాజాగా పరామర్శించి రూ. 25 లక్షల సాయం ప్రకటించారు.
గౌరవ సూచకంగా..
మురళీ నాయక్ స్వగ్రామమైన కళ్లితండా పేరు మార్చి మురళీ నాయక్ తండాగా మార్చనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అదనంగా, జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పనున్నట్టు వెల్లడించారు. దేశభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మురళీ నాయక్ కుటుంబానికి అందుతున్న ఈ మద్దతు, ఆయన సేవలకు సమాజం చేస్తున్న కృతజ్ఞత యొక్క సూచికగా చెప్పుకోవచ్చు.
Also Read: YS Jagan – Murali Nayak: ఆర్థిక సాయంపై కూడా రాజకీయాలేనా..? జగన్ మీకిది తగునా..?
బిఎస్ఎఫ్ ఎస్ఐ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాఖం, మరో ఇద్దరు సైనికులు, అలాగే జమ్మూ కాశ్మీర్ లో ఒక ఉన్నతాధికారి ప్రాణాలు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరి కుటుంబాలకు ఆయా రాష్ట్రాలతో పాటు కేంద్రం అండగా నిలుస్తోంది. చివరగా ఉగ్ర మూకల దాడిలో అమరులైన వీరి త్యాగం ఎప్పటికీ భారతావని మరచిపోదు.