భారత దేశం కోసం ప్రాణాలొదిలిన వీర జవాన్ మురళీ నాయక్. మురళీ మృతితో ఆ కుటుంబం ఎంతగా కుంగిపోయిందో అందరం చూశాం. పోయిన బిడ్డను ఎలాగూ తిరిగి తీసుకురాలేం, కనీసం ఆర్థికంగా అయినా ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మురళీ నాయక్ కుటుంబానికి రూ. 50లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సొంత నిధులనుంచి రూ.25లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ కూడా మురళీ నాయక్ కుటుంబాన్ని ఆదుకోడానికి ముందుకొచ్చారు. ఆ కుటుంబానికి రూ.25 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు జగన్. అంతా బాగానే ఉంది కానీ, ఆర్థిక సాయం ప్రకటించే క్రమంలో ఆయన మాటడ్లాడిన మాటలు మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన సందర్భంలో, ఆర్థిక సాయానికి విలువ కట్టి చూడాల్సిన అవసరం లేని వ్యవహారంలో జగన్ అనవసరంగా రాజకీయాలను తెరపైకి తెచ్చారు. తన వల్లే వీర జవాన్ కుటుంబానికి న్యాయం జరిగిందన్నట్టుగా మాట్లాడారు. గతంలో తాను మొదలు పెట్టిన సంప్రదాయాన్నే నేడు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. జగన్ వ్యాఖ్యల్ని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. మురళీ నాయక్ పరామర్శకు వచ్చిన జగన్ పొలిటికల్ వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు.
ఏపీ డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. వీర జవాన్ మురళీ నాయక్ అంతిమ యాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఒకరోజు తర్వాత ఏపీ మాజీ సీఎం జగన్ కూడా మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. దేశం కోసం మురళి త్యాగం చేశారని కొనియాడారు. ఆయన తల్లిదండ్రులకు అండగా ఉంటామన్నారు. అక్కడికక్కడే రూ.25లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన పొలిటికల్ డైలాగులు పేల్చారు. గతంలో వీర జవాన్లకు ఆర్థిక సాయం ప్రకటించే సంప్రదాయాన్ని వైసీపీ అమలులోకి తెచ్చిందని, దాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించడం సంతోషకరం అని అన్నారాయన. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు జగన్.
కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని ఆగిపోయి ఉంటే బాగుండేది, కానీ జగన్ మరో అడుగు ముందుకేసి ఆ సంప్రదాయానికి ఆద్యుడిని తానేనని చెప్పుకున్నారు. దీంతో నెటిజన్లు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. యుద్ధంలో జవాన్లు మరణిస్తే ప్రభుత్వం ఉదారంగా ఆ కుటుంబానికి సాయం అందించడాన్ని రాజకీయం చేయడమెందుకని మండిపడుతున్నారు. గతంలో కూడా ప్రభుత్వాలు సైనికులకు అండగా ఉన్నాయని గుర్తు చేశారు. జగన్ తనకు తానే ఆ సంప్రదాయాన్ని తెరపైకి తెచ్చానని చెప్పుకోవడం అమాయకత్వం అని విమర్శిస్తున్నారు.
వాస్తవానికి కూటమి ప్రభుత్వం మురళీ నాయక్ మృతిపై వెంటనే మానవతా దృక్పథంతో స్పందించింది. ప్రభుత్వంతోపాటు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తన సొంత నిధులతో భారీ సాయాన్ని ప్రకటించారు. అంతే కాదు.. జవాన్లకు ఆస్తి పన్ను కూడా మినహాయిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ కేవలం ఆర్థిక సాయం గురించి మాత్రమే ప్రస్తావిస్తూ, అందులో కూడా తన పాలనని హైలైట్ చేసుకోవాలనుకున్నారు జగన్. చివరకు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.