Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని జి.కె. వీధి మండల పరిధిలోని జెర్రెల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఏకంగా 57 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం పాలవడంతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి భోజనంలో భాగంగా విద్యార్థులకు పెరుగు, దుంపల కూర కలిపిన ఆహారాన్ని వడ్డించారు. ఈ ఆహారం తీసుకున్న కొద్దిసేపటికే విద్యార్థులలో కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపించడం స్టార్ట్ అయ్యింది. క్రమంగా ఈ లక్షణాలు ఎక్కువ మంది విద్యార్థులలో కనిపించడంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై, అత్యవసర వైద్య సహాయం కోసం ఏర్పాట్లు చేశారు. విద్యార్థులను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు.
అనారోగ్యానికి గురైన విద్యార్థులలో కొంతమందిని చికిత్స నిమిత్తం జెర్రెల ఆసుపత్రికి తరలించారు. మరికొంతమంది విద్యార్థులు, స్వల్పంగా అస్వస్థతకు గురైన వారిని, ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలోనే ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రి, పాఠశాల వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. పూర్తి చికిత్స అందించిన తరువాత వారిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు.
ఈ సంఘటనపై సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వెంటనే పాఠశాలను సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. రాత్రి వడ్డించిన ఆహారం నాణ్యతలో లోపం ఏమైనా ఉందా..? లేక ఆహార పదార్థాల తయారీలో ఏదైనా అజాగ్రత్త జరిగిందా..? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు ఆహార నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, హాస్టల్‌లో ఆహారం తయారీ, వడ్డనలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు, నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ముఖ్యంగా ఇలాంటి సున్నితమైన ప్రాంతాల్లో పర్యవేక్షణ లోపం లేకుండా చూసుకోవాలి. 57 మంది విద్యార్థులు ఒకేసారి అస్వస్థతకు గురికావడం అనేది అధికారుల నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరిపి, విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: Vijayawada: విజయవాడలో దారుణం: నర్సుగా పనిచేస్తున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త