Road Accident: తెలుగు రాష్ట్రాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పల్నాడు జిల్లాలో ప్రమాదం
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మితిమీరిన వేగంతో కారు.. చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఛిద్రమైపోయారు. ప్రమాదంలో మరో నలుగురికి గాయాలు అయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే వీరంతా హైదరాబాద్ నుంచి కావలి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సిద్ధిపేట జిల్లాలో ప్రమాదం..
మరోవైపు సిద్ధిపేట జిల్లా గజ్వేల్ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు చనిపోయారు. కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో.. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మారథాన్ రన్నింగ్‌లో పాల్గొనేందుకు ఇద్దరూ బైక్‌పై బయలుదేరారని, గజ్వేల్ బైపాస్ రోడ్డులోకి రాగానే ప్రమాదం జరిగిందని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. మృతుల్లో ఒకరు రాయపోల్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ పరంధాములు, మరొకరు దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుగా గుర్తించారు.