Tirumala Tickets: అసలే సమ్మర్ హాలిడేస్. శ్రీవారి భక్తులందరూ తిరుమల క్షేత్రబాట పట్టారు. అందుకే తిరుమల మాడవీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల గిరులలో ఎక్కడ చూసినా గోవిందా నామస్మరణ సాగుతోంది. అయితే చాలా వరకు శ్రీవారి భక్తులు ఆన్లైన్ టికెట్ పొంది స్వామి వారి దర్శనం పొందుతారు. కానీ కొంత మంది భక్తులు ఇతరత్రా కారణాలతో శ్రీవారి దర్శనం టికెట్లను ఆన్లైన్ విధానం ద్వారా పొందలేరు. అలాంటి భక్తుల కోసమే ఈ సమాచారం. మీరు ఇలా చేస్తే శ్రీవారి దర్శన భాగ్యం మీ సొంతం. ఇంతకు ఏం చేయాలో తెలుసుకోండి.
కాలినడక మార్గాలు..
తిరుమల శ్రీవారిని దర్శించేందుకు రెండు కాలినడక మార్గాలు ఉన్నాయి. ఒకటి అలిపిరి మెట్టు కాగా, మరొకటి శ్రీవారి మెట్టు. ఈ మార్గాలలో నిత్యం శ్రీవారి భక్తుల రాకపోకలు సాగుతూ ఉంటాయి. కాలినడకన శ్రీవారిని దర్శించే మొక్కు మొక్కుకున్న భక్తులు, ఈ రెండు మార్గాల గుండా దర్శన భాగ్యం పొందుతారు. అయితే ఆన్లైన్ టికెట్ లేకుండా దర్శన సౌకర్యంకు, ఈ కాలినడక మార్గాలకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా?
దివ్యదర్శనం టోకెన్లు.. ఇలా పొందండి
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే కాలినడక మార్గాలైన అలిపిరి మెట్టు, శ్రీవారి మెట్టు మార్గాల వద్ద భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు ఉచితంగా జారీ చేస్తారు. ఇవి ప్రత్యేక దర్శనానికి అనుమతించబడతాయి. ఆన్లైన్ ద్వారా టికెట్ పొందని భక్తులకు ఇదొక సదవకాశమని చెప్పవచ్చు. అందుకే ఇక్కడ భక్తుల క్యూ రద్దీగా కనిపిస్తుంది. ఇక్కడ టికెట్ పొందితే చాలు, ఆ శ్రీవారి మెప్పు పొందే దర్శన భాగ్యం తమకు దక్కిందని భక్తులు విశ్వసిస్తారు.
దర్శనం టోకెన్స్ జారీ ఇక్కడే..
అలిపిరి మెట్టు మార్గంలో మొత్తం 3,550 మెట్లు ఉంటాయి. మొత్తం 9 కిలోమీటర్ల దూరంగా చెబుతుంటారు. ఈ మార్గం గుండా వెళ్ళి శ్రీవారిని దర్శించే భక్తులు భూదేవి కాంప్లెక్స్, అలిపిరి బస్ స్టేషన్ వద్ద గల టోకెన్స్ జారీ చేసే కేంద్రాలను సంప్రదించాలి. ప్రతిరోజూ ఉదయం 4:00 గంటల నుండి టోకెన్లు పూర్తయ్యే వరకు మొత్తం 10,000 టోకెన్స్ ఇక్కడ టీటీడీ అందిస్తుంది. ఈ మెట్టు మార్గం నుండి ప్రవేశ సమయం ఉదయం 4 గంటల నుండి రాత్రి 10గ గంటల వరకుగా టీటీడీ నిర్ణయించింది.
శ్రీవారి మెట్టు మార్గం మొత్తం 2,388 మెట్లు కాగా, మొత్తం దూరం 2.1 కిలోమీటర్లు దూరంగా చెప్పవచ్చు. ఈ మార్గంలో శ్రీవారిని దర్శించే భక్తులు శ్రీవారి మెట్టు, శ్రీనివాస మంగాపురం సమీపంలో నడక సాగించాలి. టోకెన్స్ 1,240వ మెట్టు వద్ద అందజేస్తారు. ప్రతిరోజూ ఉదయం 6:00 నుండి సాయంత్రం 6:00 వరకు టోకెన్స్ అందిస్తారు. రోజువారీగా 5000 టోకెన్స్ అందజేసేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది. ఈ మెట్టు మార్గం గుండా ఉదయం 6:00 నుండి సాయంత్రం 6:00 వరకు ప్రవేశానికి అనుమతిస్తారు.
ఈ టోకెన్స్ కోసం.. ఇవి తప్పనిసరి
ఈ రెండు మెట్ల ద్వారా శ్రీవారిని దర్శించాలని భావించే భక్తులు ముందుగా టోకెన్స్ పొందేందుకు కొన్ని పద్దతులు పాటించాలి. టోకెన్ పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాగా, పిల్లల కోసం అంటే 12 సంవత్సరాల లోపు వారికి టోకెన్ అవసరం లేదు. ఈ టోకెన్లు బయోమెట్రిక్ విధానంలో జారీ చేయబడతాయి కాబట్టి ఇతరులకు బదిలీ చేయకూడదు. అంతేకాదు ఈ రెండు మెట్ల మార్గం వద్ద లగేజ్ డిపాజిట్ సౌకర్యం ఉంది. ఆ తర్వాత మీరు తిరుమలలో లగేజ్‌ను తిరిగి పొందవచ్చు. ప్రతి మార్గంలో ఉచిత బస్సులు, త్రాగునీరు, టాయిలెట్‌లు, విశ్రాంతి స్థలాలు, 24×7 భద్రత అందుబాటులో ఉంటాయి. ఇలా ఆన్లైన్ లో టికెట్స్ పొందని శ్రీవారి భక్తులు ఈ మార్గాల ద్వారా శ్రీవారిని దర్శించవచ్చు.