AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో కొల్లగొట్టిన వేల కోట్ల ముడుపుల సొత్తుతో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సిట్ గుర్తించింది. బెంగళూరులోనే వెయ్యి కోట్లకు పైగా పెట్టినట్లు కీలక సమాచారం సేకరించింది. ముడుపుల సొత్తును డొల్ల కంపెనీల ద్వారా పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లోకి మళ్లించటంలో భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీతో పాటు జగన్, భారతిలకు అత్యంత సన్నిహితుడైన మరో వ్యక్తీ క్రియాశీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది.
ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత ముడుపులు వచ్చాయి? వాటిని ఏయే మార్గాల ద్వారా రూటింగ్ చేసి, రియల్ ఎస్టేట్ సంస్థల ఖాతాల్లోకి మళ్లించాలనే దానిపై కీలక సమావేశాలు జరిగాయని.. ఈ సమావేశాల్లో గోవిందప్పతో పాటు మరో కీలక వ్యక్తి పాల్గొనేవారని గుర్తించారు. ఇప్పటికే గోవిందప్పను అరెస్ట్ చేయడంతో కీలక విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తే.. మొత్తం వివరాలు బయటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అసలు స్కామ్‌కు ప్లాన్ చేసింది ఎవరు? దాని వల్ల అంతిమంగా లబ్ది పొందింది ఎవరు? అనే విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.
మద్యం ముడుపుల సొత్తుతో వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టగా.. ప్రస్తుతం వాటి విలువ 3 వేల కోట్లకు పైగా పెరిగిందనేది ఓ అంచనా. ఈ మొత్తం బినామీ వ్యక్తులు, సంస్థల పేరిటే ఉన్నాయని తెలుస్తోంది. పెట్టుబడుల వ్యవహారమంతా గోవిందప్ప బాలాజీతో పాటు మరో వ్యక్తి పర్యవేక్షించేవారని సిట్ గుర్తించింది. ఏయే రియల్ ఎస్టేట్ కంపెనీల్లోకి ఎలా డబ్బు మళ్లించారు? దీని కోసం ఎన్ని డొల్ల కంపెనీలు సృష్టించారు? వాటిని అడ్డం పెట్టుకుని మనీ రూటింగ్ ఎలా చేశారు? సొత్తంతా చివరికి ఎవరికి చేరింది? అనే విషయాలను తెలుసుకోవడంపై ఫోకస్ చేశారు.
అంతేకాదు రాజ్ కెసిరెడ్డి, అతని ముఠా వసూలు చేసిన ముడుపుల సొత్తును ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి ద్వారా జగన్‌కు చేర్చేవారని ఇప్పటికే దర్యాప్తులో తేలిందని తెలుస్తోంది. ఈ కేసులో 32వ నిందితుడైన జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న 3 కంపెనీల కార్యాలయాలతో పాటు, మరికొన్ని సంస్థల్లో సిట్ సోదాలు నిర్వహించాయి.
Also Read: వైసీపీకి మరో షాక్.. మండలి డిప్యూటి ఛైర్‌పర్శన్ రాజీనామా
నాటికల్ గ్రీన్ ఎనర్జీ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐబాట్ ఎనర్జీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్కూబీల్యాబ్స్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నారు. ఐబాట్ ఎనర్జీ సిస్టమ్స్ మినహా మిగతా రెండు కంపెనీలూ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటయ్యాయి. ఈ మూడు కంపెనీల నుంచి కీలక పత్రాల్ని సిట్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.