Pakistan Release BSF Ranger| పాకిస్తాన్ సైన్యం వద్ద బందీగా ఉన్న భారతదేశానికి చెందిన ఒక సైనికుడు తిరిగి స్వదేశం చేరుకున్నాడు. బార్డర్ వద్ద పాకిస్తాన్ అధికారులు అతడిని ఇండియన్ బార్డర్ ఆఫీసర్స్ కు బుధవారం ఉదయం అప్పగించినల్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం పొరపాటున సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఒక జవాన్ ని పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
పహల్గాం ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ సాహు (40) ఏప్రిల్ 23, 2025న పంజాబ్ లో విధులు నిర్వర్తిస్తూ పొరపాటున పాకిస్తాన్ భూభాగంలో కి ప్రవేశించాడు. ఆ సమయంలోనే పాకిస్తాన్ రేంజర్లు అతడిని అరెస్ట్ చేశారు. అయితే 182వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ పూర్ణం కుమార్ సాహును విడిపించడానికి భారత సైన్యం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఆయన పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో బార్డర్ వద్ద గస్తీ కాస్తూ పాక్ భూభాగంలోకి వెళ్లిపోయారని అక్కడ స్థానికంగా ఉన్న రైతుల పంటలకు భద్రతగా ఉన్న ఆయనను పాక్ రేంజర్లు అరెస్ట్ చేశారు. గస్తీ కాస్తున్న సమయంలో తీవ్ర ఎండ కారణంగా సమీపంలోని ఒక చెట్టు కింద నీడ కోసం వెళ్లిన పూర్ణం కుమార్ ను పాకిస్తాన్ రేంజర్లు గమనించి.. అతడు కూర్చొన్న ప్రదేశం పాక్ భూభాగమని చెప్పి అరెస్టు చేశారు.
తమ కస్టడీలో ఒక బిఎస్ఎఫ్ జవాన్ ఉన్నట్లు పాకిస్తాన్ రేంజర్లు అప్పటికే భారత సైన్యానికి సమాచారం అందించారు. అప్పటి నుంచి ఇరు వైపులా ఆయనను విడిపించడానికి చర్చలు కొనసాగుతున్నాయి. కానీ మధ్యలో భారత్, పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల యుద్దం జరగడంతో ఆ చర్చలు నిలిచిపోయాయి. తాజాగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదరడంతో మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ రోజు బుధవారం ఉదయం 10.30 గంటలకు అట్టారి బార్డర్ అమృత్‌సర్ వద్ద పాకిస్తాన్ రేంజర్లు ఇండియన్ బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ సాహును అధికారికంగా అప్పగించారు. ఈ విషయాన్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది.
Also Read: హనీట్రాప్‌లో పాక్ దౌత్యాధికారి.. బంగ్లాదేశీ యువతితో అశ్లీల వీడియోలు
బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ సాహు అరెస్ట్ అయినప్పటి నుంచి అతడి భార్య తన భర్త రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. ఆమె గర్భవతి అని.. తన భర్తను క్షేమంగా తిరిగి తీసుకురావాలని ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ సాహు కోల్ కతాకు చెందిన వాడు. దీంతో అతని భార్య కోల్ కతా నుంచి పఠాన్ కోట్ కు వెళ్లి బిఎస్ఎఫ్ అధికారులతో కలిసి మాట్లాడింది. ఆ సమయంలో పూర్ణం కుమార్ ను క్షేమంగా తీసుకువస్తామని అధికారులు హామీ ఇచ్చారు. గర్భవతి అయిన ఆమెను అమృత్ సర్ నుంచి కోల్ కతాకు విమానంలో తిరిగి పంపించారు.