YSRCP : అసలే అనంతపురం జిల్లా. ఫ్యాక్షన్ పగలు బుసలు కొట్టే ఖిల్లా. ప్రభుత్వాలు మారినప్పుడట్టా ఆ ప్రాంతంలో రక్తపు టేరులు మారుతుంటాయి. గత వైసీపీ హయాంలో హత్యా రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతీకార దాడులు తారాస్థాయిలో జరుగుతాయని అనుకున్నారు. కానీ, శాంతిభధ్రతల విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సీరియస్‌గా ఉన్నారు. వైసీపీ వారిపై ఎలాంటి దాడులకు దిగొద్దని తమ కేడర్‌ను గట్టిగానే హెచ్చరించారు. ఆ ఫలితం కనిపిస్తోంది. ఫ్యాక్షన్ సీమలో రక్తపాతం తగ్గుతోంది. కానీ……
మళ్లీ ఫ్యాక్షన్ దాడులు?
దశాబ్దాల రక్తచరిత్రను రాత్రికి రాత్రే మార్చేయగలరా ఎవరైనా? అక్కడక్కడా దాడులు జరుగుతున్నాయి. తాజాగా, అనంత జిల్లా పాపిరెడ్డిపల్లిలో రెండు వర్గాలు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డాయి. ఫ్యాక్షన్ స్టైల్ దాడులు జరిగాయి. ఆ అటాక్‌లో వైసీపీకి చెందిన కురుమ లింగమయ్య చనిపోయాడు. అతని ఇద్దరు కుమారులపై హత్యా ప్రయత్నం జరిగినా.. వాళ్లు తప్పించుకున్నారు. చనిపోయింది వైసీపీ నాయకుడు కావడంతో రాజకీయ రంగు పులుముకుంది. అనంతపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రంగంలోకి దిగారు. హతుడు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి పాపిరెడ్డిపల్లి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ గ్రామానికి గోరంట్ల వెళ్తే.. పరిస్థితి చేజారిపోతుందని.. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంటుందంటూ పోలీసులు అలర్ట్ అయ్యారు.
గోరంట్ల ఇంటి దగ్గర హైటెన్షన్
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. మృతి చెందిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లకుండా ఆయన్ను అడ్డుకున్నారు. గేటుకు తాళం వేశారు. గోరంట్ల మాధవ్ బయటకు రాకుండా ఆయన ఇంట్లో పోలీసులు మోహరించారు. పోలీసులతో గోరంట్ల మాధవ్ వాగ్వాదానికి దిగారు. విషయం తెలిసి.. గోరంట్లకు మద్దతుగా వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కాసేపు పోలీస్ వర్సెస్ వైసీపీ. హైటెన్షన్ క్రియేట్ అయింది.
Also Read : కొడాలి నానికి సీరియస్.. ముంబై తరలింపు!
ఇంట్లోకి పోలీసులు చొరబడి.. తనను అడ్డుకోవడంపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సీరియస్ అయ్యారు. తానేమీ తీవ్రవాదినో, సంఘ వ్యతిరేక శక్తినో కాదని.. మాజీ ఎంపీ, మాజీ పోలీస్ అధికారినని గుర్తు చేశారు. తనకు చట్టం తెలుసని.. పోలీసులు తనను ఇలా అడ్డుకోవడంత తగదని మండిపడ్డారు. పరిటాల బంధువులు తమ పార్టీ కార్యకర్తను చంపారని.. ఆ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పేందుకే వెళుతున్నానని అన్నారు. తనపై ప్రభుత్వం, పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని.. ఇది సరైన పద్దతి కాదని అన్నారు. తనను బయటకు వెళ్లనివ్వాలని పట్టుబట్టారు గోరంట్ల మాధవ్.
మాజీ ఎంపీ ఎంతగా వాదించినా.. వైసీపీ కార్యకర్తలు ఎంతలా వ్యతిరేకించినా.. పోలీసులు ఏమాత్రం తగ్గలేదు. గోరంట్లను ఇంట్లోనే కట్టడి చేశారు. దాదాపు హౌజ్ అరెస్ట్ చేశారు. కార్యకర్తలను బలవంతంగా బయటకు పంపించేశారు. ఆ గ్రామానికి గోరంట్ల వెళితే మళ్లీ దాడులు జరిగే ఛాన్స్ ఉన్నందున.. ముందస్తు చర్యల్లో భాగంగా మాధవ్‌ను ఆయన ఇంట్లోనే అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇందులో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని.. అన్నీతెలిసిన మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ అలాంటి ఆరోపణలు చేయడం సరికాదంటున్నారు ఖాకీలు.