Fengal Cyclone Effect: ఏపీలో ఫెంగల్ తుఫాను ప్రభావం ఆదివారం అధికంగా కనిపించింది. శనివారం పలు జిల్లాలలో మోస్తారు వర్షం కురవగా, ఆదివారం మోస్తారు వర్షం నుండి భారీ వర్షం కురిసింది. ప్రధానంగా చిత్తూరు, తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాలలో వర్షం ప్రభావం అధికంగా కనిపించింది. కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలిసిన తిరుమలలో సైతం హోరు వాన కురవగా, తిరుమల రహదారిలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు వెంటనే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలకు శ్రీకారం చుట్టారు.
అలాగే చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలలో కూడా భారీ వర్షపాతం నమోదయింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తుఫాను హెచ్చరికలపై జిల్లా అధికార యంత్రంగానే అప్రమత్తం చేస్తూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సంభందిత కలెక్టర్లకు ఆదేశించింది. ఇప్పటికే చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడి కేంద్రాలకు రేపు అనగా సోమవారం సెలవుదినంగా ప్రకటించారు.
ఈ విషయాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల యాజమాన్యం గమనించి తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని కలెక్టర్లు ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి తరగతులు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
Also Read: Viral News: శ్రీ హనుమాన్ ఆలయంలో అద్భుతం.. తరించిన భక్తజనం.. ఆ లీల ఏమిటంటే?
ఇది ఇలా ఉండగా నెల్లూరు, కడప జిల్లాలో సైతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు మంజూరు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా తుఫాను హెచ్చరికలపై ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ ముందు నుండి జాగ్రత్తపరచడంతో పెను ప్రమాదం తప్పిందని భావించవచ్చు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు తుఫాను పరిస్థితి గురించి తెలుసుకుంటూ.. సహాయక చర్యలకు సైతం రెస్క్యూ టీం ను అప్రమత్తం చేశారు.