Howrah Express: ఆ వ్యక్తి లేకుంటే ఈ సమయానికి వేల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఆ వ్యక్తే లేకుంటే భారీ ప్రాణనష్టం వాటిల్లే పరిస్థితి. ఇంతకు ఆ వ్యక్తి చేసిన పని ఏంటి? అసలేం జరిగిందో తెలుసుకుంటే.. ఆ వ్యక్తికి ఘన సన్మానాలు చేయాల్సిందే.
అహ్మదాబాద్ నుండి హౌరాకు వెళ్లే రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఒక్క వ్యక్తి చొరవ, సమయస్ఫూర్తితో ప్రమాదం తప్పగా.. రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అహ్మదాబాద్ నుండి బయలుదేరిన రైలు హౌరా కు వెళ్తూ.. గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలోని తిరుపతి జిల్లా అడవయ్య కాలనీ వద్దకు చేరే సమయం అది. ఆ సమయాన రైల్వే పట్టాల వద్దకు సునీల్ అనే వ్యక్తి వచ్చాడు. అలా వచ్చిన సునీల్ అక్కడ రైలు పట్టాలు విరిగిన విషయాన్ని గమనించాడు.
అలా గమనించిన అతను వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు. అప్పుడే హౌరా ఎక్స్ ప్రెస్ వచ్చే సమయమది. వెంటనే స్థానికులను సంప్రదించి ఒక ఎర్ర తువాలును చేతిలో పట్టుకొని రైలుకు ఎదురెళ్లాడు. ఆపండి ఆపండి అంటూ కేకలు వేస్తూ.. ఎదురెళ్లగా వెంటనే రైలు లోకో పైలట్ ఈ విషయాన్ని గమనించాడు. అలా గమనించి ఏదో ప్రమాదం పొంచి ఉందని గ్రహించి, రైలును నిలిపివేశారు.
రైలు దిగి వచ్చిన లోకో పైలట్ పట్టాలు విరిగినట్లు గుర్తించి రైల్వే అధికారులకు అసలు విషయం చెప్పాడు. అధికారులు రైల్వే పట్టా విరిగిన ప్రదేశం వద్దకు చేరుకొని, పట్టాలు గమనించి సరిచేసే ప్రక్రియను ప్రారంభించారు. ఇక్కడ రైల్వే పట్టాలు విరగడంతో సుమారు గంటపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సునీల్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు, సునీల్ ను ప్రత్యేకంగా అభినందించారు.
Also Read: Weather Update: మండే ఎండలు.. ఆరోజు మాత్రం మండిపోద్ది.. తస్మాత్ జాగ్రత్త
సునీల్ లేకుంటే..
రైల్వే పట్టాలు విరిగిన సమయంలో సునీల్ లేకుంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ. రైలు పట్టాలు విరిగినట్లు గమనించడమే కాక, స్థానికులను అప్రమత్తం చేసి ఎర్రటి కండువా పట్టుకొని రైలుకు ఎదురెళ్లడం అతని సమాయస్పూర్తికి నిదర్శనమని స్థానికులు కొనియాడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా గతంలో జరిగాయి. ఇదే తరహాలో ఏపీలోని వేటపాలెం వద్ద ఓ వ్యక్తి రైలుకు ఎదురెళ్లి లోకో పైలట్ ను అప్రమత్తం చేశారు. ఆ సమయంలో నాటి ఎస్పీ వకుల్ జిందాల్ సన్మాన కార్యక్రమం నిర్వహించి అభినందించారు.
అదే తరహాలో సునీల్ ను రైల్వే శాఖ అభినందన కార్యక్రమం నిర్వహించి ప్రోత్సహించాలని స్థానికులు కోరుతున్నారు. మొత్తం మీద సునీల్ చొరవతో హౌరా ఎక్స్ ప్రెస్ కు పెద్ద ప్రమాదమే తప్పిందని ప్రయాణికులు, స్థానికులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాల్సిన భాద్యత రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉందని పలువురు తెలుపుతున్నారు. రైల్వే పట్టా పనులు ముగిసిన అనంతరం యథావిధిగా రైళ్ల ప్రయాణం సాగింది.