Kodela Sivaprasad : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వెనుక కుట్ర జరిగిందా? ఆయన సూసైడ్ చేసుకునేలా ఎవరైనా ఒత్తిడి చేశారా? చనిపోయి ఏళ్లు గడిచినా ఆ ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇప్పుడా ప్రశ్నలకు సమాధానం రాబోతోందా? ఇంతకీ తెర వెనుక అసలేం జరిగింది? కోడెల ఎందుకు చనిపోయారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవేయండి.
టీడీపీ ప్రభుత్వాల్లో కీలక పదవులు చేపట్టి, సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన.. మాజీ స్పీకర్ కోడెల శివప్రాదరావు తనపై పెట్టిన కేసుల ఒత్తిడికి తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. టీడీపీ అధికారం కోల్పోయిన, వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఈ ఘటన జరగడంతో.. వైసీపీ నేతల కక్షపూరిత చర్యల వల్లే ఆయన చనిపోయారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందంటూ టీడీపీ వర్గాలు అనేక విమర్శలు సైతం చేశాయి. తాజాగా.. ఆ విమర్శలే నిజం అయ్యేలా కనిపిస్తున్నాయి.
రైల్వేలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని కోడెల, ఆయన కుమారుడు శివరామ్ తన నుంచి రూ.15 లక్షల లంచం తీసుకున్నారని 2019లో రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు ఫిర్యాదు చేశాడు. నరసరావుపేట టూ టౌన్ పోలీసులు.. దీనిపై కేసు నమోదు చేశారు. కొంతకాలంగా పాటు ఈ కేసు విషయమై దర్యాప్తు కూడా చేశారు. ఆ తర్వాత ఈ కేసు పెద్దగా ప్రచారంలోకి కానీ, ప్రభావంతంగా కానీ విచారణ జరగలేదు. కోడెల మరణించడంతో.. ఈ కేసు ప్రాధాన్యత కోల్పోయింది.
ఇదే కేసులో తాజాగా నరసరావుపేట కోర్టుకు హాజరైన నాగరాజు.. లోక్ అదాలత్‌ని ఆశ్రయించారు. కోడెల శివప్రసాద్, ఆయన కుమారుడు శివరాంపై పెట్టిన కేసు విత్ డ్రా చేసుకుంటున్నానంటూ బాంబు పేల్చాడు. ఆనాడు తాను కేసు పెట్టడం వెనుక రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నాయని, అప్పటి వైసీపీ నేత, మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి బలవంతంగా తనతో కేసు పెట్టించారంటూ ప్రకటించారు.
తన కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగమని తెలిసినా, ఆంధ్రా క్రికెట్ జట్టులో ఆడనివ్వరేమోనన్న భయంతోనే తాను కోడెల, ఆయన కుమారుడిపై కేసు పెట్టానంటూ మాజీ క్రికెటర్ నాగరాజు చెప్పారు. ఈ పరిణామాలతో ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి గోపిరెడ్డిని టార్గెట్ చేసుకునేట్టు కనిపిస్తోంది.
రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు తాజా ఆరోపణలతో.. గోపిరెడ్డి అడ్డంగా బుక్ అవుతారనే టాక్ నరసరావుపేటలో జోరుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్థానిక టీడీపీ నేతలు.. తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో లోకల్ వైసీపీ లీడర్ల గుండెల్లో గుబులు చెలరేగుతోందట. ఇటీవల నరసరావుపేటలో ఒక డిగ్రీ కాలేజీ ఫంక్షన్‌లో తమ అధినేత పేరెత్తగానే స్టూడెంట్స్ నుంచి వచ్చిన అనూహ్య స్పందనకు ఉబ్బి తబ్బిబ్బవుతున్న స్థానిక వైసీపీ నేతలు.. తాజా పరిణామాలతో షాక్ అవుతున్నారు.
Also Read : Nara Lokesh : ఇంత దుర్మార్గం ఎక్కడా లేదు – పారిశ్రామిక రాయితీల్లోనూ లంచాలు అడిగారు
తమ అధినేత క్రేజ్ ఇంకా తగ్గలేదని చెప్పుకోవడానికి, తమ ప్రాంతం వేదికైందని సంతోషించేలోపు ఈ కేసు ఇలా రివర్స్ కావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట. ప్రస్తుతం మలుపు తిరిగిన ఈ పరిణామంతో నరసరావుపేట రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. నరసరావుపేట వైసీపీకి గట్టి దెబ్బగానే ఫీలవుతున్నారట నేతలు. ఈ కేసు విషయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరింతగా ఇరకాటంలో పడతారో లేదో వెయిట్ అండ్ సీ అంటున్నారు స్థానికులు.