Big Stories

Devineni Uma: టీడీపీలో హీరోగా ఉన్న దేవినేని ఉమా.. జీరో అయ్యాడా..?

DEVINENI UMA BAD TIME : ఒకప్పుడు ఆయన మాట అంటే వేదవాక్కు.. ఎంత సీనియర్లైనా ఆయన నోటికి జడిసే పరిస్థితి ఉండేది. ఒక్కముక్కలో చెప్పాలంటే చంద్రబాబు తరువాత టీడిపీలోనూ, ఆ ప్రభుత్వంలోనూ నెంబర్ టూగా చెలామణి అయ్యారు. కట్ చేస్తే.. ఓడలు బళ్లు అయ్యాయంటారు చూడండి. అలా తయారైంది సదరు లీడర్ పరిస్థితి. కృష్ణాజిల్లాలో ఎవరికి సీటు ఇవ్వాలో డిసైడ్ చేసే స్థాయి నుంచి.. తన సీటు కాపాడుకోవడానికి నానా పాట్లు పడాల్సి వస్తోందాయనకి.. ఇంతకి ఎవరా నేత? ఎందుకా పరిస్థితి వచ్చింది?

- Advertisement -

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. దేవినేని ఉమాగా ఆయన పేరు తెలియనివారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండరు. నోరు తెరిచారంటే ప్రత్యర్ధులపై నిప్పులు చెరుగుతుంటారు. అదే ఆయన బలం. బలహీనత కూడా.. అన్నయ్య మాజీమంత్రి దేవినేని వెంకటరమణ మరణం తరువాత ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో దాదాపు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో సొంత కేడర్‌ని ఏర్పాటు చేసుకోగలిగారు.. ఒకరకంగా జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగి.. కృష్ణా జిల్లా సీఎం అన్న టాగ్‌లైన్ సొంతం చేసుకున్నారు.

- Advertisement -

అన్న మరణం తర్వాత 1999లో జరిగిన ఉపఎన్నికల్లో , 2004 ఎన్నికల్లో నందిగామ ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని.. తర్వాత ఆ సెగ్మెంట్ రిజర్వ్‌డ్ అవ్వడంతో 2009, 2014 ఎన్నికల్లో మైలవరం ఎమ్మెల్యేగా విజయాలు సొంతం చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టి.. పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకాలను అతితక్కువ కాలంలో పూర్తి చేసి జాతీయ స్థాయిలో ఫోకస్ అయ్యారు. ఏపీ జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు వేగవంతం చేసి.. 2019 నాటికి రికార్డు స్థాయి లో 75 శాతం వరకు పూర్తి చేయించగలిగారు .

మంత్రిగా ఉన్న టైంలో ఉమాను ప్రసన్నం చేసుకుంటే చాలు చంద్రబాబుని ప్రసన్నం చేసుకున్నట్లే అన్న స్దాయిలో ఆయన హవా నడిచింది. జగన్ పై, వైసీపీపై అప్పట్లో ఉమా చేసిన ఎదురుదాడి బహుశా ఏ టీడీపీ సీనియర్ నాయకుడు చేసుండరేమో.. మంత్రిగా , సీనియర్ నేతగా కృష్ణా జిల్లాతో పాటు.. రాష్ట్రంలో తిప్పిన ఆయనకు 2019 ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. పాతాళానికి పడేశాయి. అప్పటి నుంచి ఆయన డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. అందులో ఎవరి పాత్రా లేదు. ఆయన్ని ఎవరూ తొక్కేయలేదు. అంతా ఆయనే చేసుకున్నారంటారు. స్వయంకృతాపరాధం అనే పదానికి ఉమా నిర్వచనంగా మారారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కృష్ణాజిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఉమా కెరీర్‌ని 2019 ఎన్నికలు ఘోరంగా దెబ్బతీశాయి. వైసీపీ నుండి బరిలోకి దిగిన వసంత కృష్ణప్రసాద్‌ను తక్కువంచనా వేసిన ఉమా.. మైలవరంలో టీడీపీ తప్ప వైసీపీ గెలిచే పరిస్ధితి లేదన్న ధీమాకు పోయి పోల్ మేనేజ్‌మెంట్‌ని నిర్లక్ష్యం చేశారంటారు.. అదే ఆయన కొంపముంచి .. వసంత చేతిలో 13 వేల తేడాతో ఉమా ఓడిపోయారు. ఆయన ఓడిపోవడంతోనే నిత్యం రద్దీ గా ఉండే ఉమా‌ ఇల్లు వెలవెలబోయింది. నాయకుడికి , క్యాడర్‌కి మద్యా గ్యాప్ కూడా పెరుగుతూ వచ్చింది. ఎంతలా అంటే ఉమాను పలు కేసుల్లో అరెస్ట్ చేసినా నియోజకవర్గంలో కనీసం ఎవరూ నోరు ఎత్తలేదు.

ఓ వైపు వసంత ఉమాపై ఎదురుదాడికి దిగినా.. ఉమానే కౌంటర్ ఇచ్చుకోవాలి తప్ప.. ఎవరూ సపోర్ట్ చేసే పరిస్దితి లేకుండాపోయింది. పోనీ మైలవరం నియోజకవర్గం సంగతి అటుంచితే.. జిల్లాలో తాను లిఫ్ట్ ఇచ్చానని చెప్పుకునే లీడర్లు సైతం ఉమాకు దూరంగా జరిగిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే సొంత జిల్లాలో, నియోజకవర్గంలో ఉమాకు సహాయనిరాకరణ ఎదురవుతూ వచ్చింది. ఒకప్పుడు రాజులా ఉన్న ఉమా ఇప్పుడు జీరోలా మారడానికి కారణం ఆయన నోరు, తన ఆధిపత్యధోరణేనని పార్టీలోని ఆయన వ్యతిరేకులు అంటున్నారు.

దేవినేని మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో క్యాడర్‌కి ఏం చేయలేదని.. సొంత పార్టీవాళ్లనే కించపరిచేలా మాట్లాడారన్న ఆరోపణలున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ , బెజవాడ ఎంపీ కేశినేని నాని లాంటివాళ్లు పార్టీకి దూరమవ్వడానికి మంత్రిగా ఉన్నప్పుడు ఉమా చేసిన పెత్తనమే కారణమని జిల్లా నేతలు ఓపెన్‌గారు అంటున్నారు. చంద్రబాబు ఉమాకు మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయనలో కాన్ఫిడెన్స్ లెవల్స్ ఓవర్ అయ్యాయని.. అదే ఆయన కొంపముంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ దుస్థితికి ఉమా ఓవర్ యాక్షనే కారణమని టీడీపీ పెద్దలు ఇప్పటికి గ్రహించారంటున్నారు. ఉమాను మైలవరం నుండి పంపిస్తేనే తప్ప మైలవరం, నందిగామలో గెలిచే పరిస్దితి లేదని పార్టీ సర్వేల్లో తేలిందంట. దాంతో మైలవరంలో ఉమాకు ప్రత్యామ్నాయంగా.. ఏకంగా ఉమా ఆగర్భశత్రువు వసంత కృష్ణప్రసాద్‌నే పార్టీలోకి తీసుకొచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమా తన సీటు నిలబెట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్నప్పటికి.. వెళ్తే పెనమలూరు వెళ్లు.. లేదంటే పార్టీ బాధ్యతలు చూసుకోమని.. అధినాయకత్వం ఉమా మొహం మీదే చెప్పినట్డు.. టీడీపీలోని ఉమా వ్యతిరేకులు ప్రచారం మొదలుపెట్టారు.

మొత్తానికి జిల్లాలో రెండు మూడు సీట్లు ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేసే స్టేజ్ నుంచి.. తన సీటుకి గ్యారెంటీ లేకుండా పోయే స్థితికి వచ్చారు మాజీ మంత్రి.. అందుకే మైలవరం టికెట్ దక్కించుకోవడానికి.. అధిష్టానంపై సెంటిమెంట్ అస్త్రాలు ప్రయోగిస్తున్నారంట.. ఒకవేళ ఉమాకి మైలవర్గం టికెట్ దక్కకపోతే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News